social media war on kodela Siva Prasada Rao -suspicious death.jpgటీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. అయితే సోషల్ మీడియాలో ఇది వికృత క్రీడకు దారి తీసింది. కొత్త ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకు తాళలేక ఆయన కన్నుమూశారని టీడీపీ అభిమానుల ఆరోపణ. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి… కొడుకుతో గొడవ జరిగిందని అందుకే ఆయన ఉరి వేసుకున్నారని, దానిని కప్పిపుచ్చడానికే బాలయ్యకి చెందిన బసవతారకం కాన్సర్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారని ఆరోపించారు.

కొందరైతే ఏకంగా తాను చేసిన దారుణాలు బయటపడకుండా చంద్రబాబే చేయించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా మూడు నెలలు కేసులు పెట్టినందుకు ఆత్మహత్య చేసుకుంటే జగన్ ను 16 నెలల పాటు జైలులో పెట్టి వేధించారంటూ దెప్పి పొడిచారు. దీనికి కొందరు టీడీపీ అభిమానులు సీత అగ్ని పరీక్ష చేసుకుంది గానీ చింతామణి కాదు అంటూ ఎద్దేవా చేసారు. కొందరు అధికార పార్టీ అభిమానులు ఏకంగా ఇప్పుడు కోడెలకు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది అంటూ శాపనార్ధాలు పెట్టారు.

ఈ చావు రాజకీయాలలో మీడియా ఏమీ తక్కువ తినలేదు. గోదావరిలో పడవ మునిగి ఎందరో గల్లంతు అయ్యారు. ఇప్పటివరకు కొంత మంది జాడ తెలియలేదు. అయితే మీడియా ఆ వార్తను వదిలేసి పూర్తిగా కోడెల వార్తల మీద పడింది. కనీసం పోస్టు మోర్టమ్ కూడా పూర్తి కాకముందే పుకార్లు వ్యాపింపచేసి కుట్ర కోణం అంటూ టీఆర్పీల వేటలో పడిపోయింది. మరోవైపు కోడెల అంతిమసంస్కారాలు రేపు మధ్యాహ్నం నరసారావుపేటలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.