royal challengers bangaloreఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం నాడు (23-04-2017) కోల్ కతాతో తలపడిన బెంగుళూరు జట్టు అత్యంత స్వల్ప స్కోర్ (49 పరుగుల)ను నమోదు చేసి అబాసుపాలైన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లి సేనను ఓ ఆట ఆడుకున్నారు. “లక్ష్యం చిన్నదే… మ్యాచ్ పది ఓవర్లలో అయిపోవాలి” అని ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత డ్రస్సింగ్ రూములో తన జట్టు సభ్యులతో కోహ్లీ చెప్పగా… వారు దాన్ని తూచ తప్పక పాటించారట.

పది ఓవర్లలో గెలవాలన్న ఉద్దేశంతో కోహ్లీ చెబితే, పది ఓవర్లలో ముగియాలని కెప్టెన్ చెప్పాడు కాబట్టి, అలా వెళ్లి ఇలా వచ్చేద్దామని ఆటగాళ్లు భావించారట. అందుకే ఫలితం అలా వచ్చిందని సోషల్ మీడియాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర ఓటమిపై సెటైర్ల మీద సెటైర్లు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఆటగాళ్ళు వరుసగా నమోదు చేసిన స్కోర్లతో “70189 820250” నెక్స్ట్ జనరేషన్ ఫోన్ నెంబర్ వచ్చేసిందంటూ విరుచుకుపడుతున్నారు. అయితే ఈ వ్యంగ్య కామెంట్లను అరాయించుకోవడం కోహ్లీ టీమ్ కు కష్టంగానే ఉంది.

అయితే ఇన్ని విమర్శలను ఎదుర్కొవడానికి కారణమైన ఇదే రోజు… ఓ నాలుగు సంవత్సరాల క్రితం 23-04-2013వ తేదీ నాడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 263 పరుగులను నమోదు చేసింది కూడా బెంగుళూరు జట్టే. దీంతో నాలుగు సంవత్సరాల తేడాతో అదే రోజున అత్యంత చెత్త రికార్డును కూడా కోహ్లి సేన మూటకట్టుకోవాల్సి రావడం విచిత్రమే. దీంతో ఏప్రిల్ 23వ తేదీతో – బెంగుళూరు జట్టుకు ఏదో ‘హార్రర్’ రిలేషన్ ఉండి ఉంటుంది అంటున్నారు నెటిజన్లు.