Ravanam Swaminaiduచిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ గా, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడిగా రవనం స్వామినాయుడు మెగా అభిమానులందరికీ సుపరిచితుడే. నిన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ లో సైరా సినిమా చుసిన ఆయన ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ… చిరంజీవి పెర్ఫార్మన్స్ ను ఆకాశానికి ఎత్తేశారు.

అంతటితో ఆగకుండా ఇంతగొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చిన చిరంజీవికి భారత ప్రభుత్వం చిరంజీవికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. సినిమా పెర్ఫార్మన్స్ కు భారతరత్న ఏంటి అని ఆ మీడియా వాళ్ళు విస్తుపోయినా మిన్నకుండిపోయారు. సినిమాలకు భారతరత్న ఇవ్వరని స్వామినాయుడుకి ఆ తరువాత కూడా ఎవరూ చెప్పలేదేమో అదే మాట తీసుకొచ్చి ట్విట్టర్ లో వేశారు.

ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇతర హీరోల అభిమానులు అది పట్టుకుని మెగా ఫ్యాన్స్ ను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు సైరా మొదటి రోజు బాక్స్ ఆఫీసు వద్ద ఇరగదీసింది. చాలా చోట్ల బాహుబలి 2 తరువాతి స్థానంలో ఉంది. సినిమా టాక్ బావుండడంతో దసరా సెలవులు పూర్తి అయ్యే వరకూ సినిమా ధోకా లేదంటున్నారు.

విడుదలకు ముందు సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. టాక్ బావుండడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. చిరంజీవి కమ్ బ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు దానికి రెండింతలు రాబట్టాల్సి ఉంది.