Ram Charan - Upsana Kamineniఈ రోజు రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి రోజు. ఈ జంట 2012 జూన్ 14 న వివాహం చేసుకున్నారు. సోమవారం, ఉపాసన, భర్త రామ్ చరణ్ తమ ప్రైవేట్ జెట్‌లో కూర్చుని ఉన్న చిత్రాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆ ఫోటో ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఉపాసన. బహుశా వారు ఏదో హోలీడే కు వెళ్తున్నట్టుగా ఉంది.

అయితే ఎక్కడికి అనేది తెలీదు. అది అలా ఉండగా..ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న కామెంట్లు జుగుప్సాకరంగా ఉన్నాయి. పెళ్లయి తొమ్మిదేళ్లు అయ్యింది ఇంకా పిల్లలు లేరా అని కొంత మంది… బిజినెస్లు పక్కన పెట్టి ఇంటి పట్టున ఉండు అని ఇంకొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.

సెలబ్రిటీలకు పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుందని చాలా మంది గుర్తించరు. వారి అభిమానాన్ని, పిచ్చిని, లేక ఇంకొకటి సినిమాల వరకే పరిమితం చెయ్యకుండా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం అత్యంత గర్హనీయం. చివరకు పిల్లలు కనడం వంటి అత్యంత వ్యక్తిగత విషయాల్లోకి అభిమానం పేరిట తమ తమ పరిధిని మర్చిపోయి జుగుప్సాకరంగా దూరిపోయి సలహాలు ఇవ్వడం సిగ్గుపడాల్సిన విషయం.

అసలు సెలెబ్రిటీ లేదా ఇంకెవరైనా సరే పిల్లల విషయంలో వారి నిర్ణయాలను వారు తీసుకునే స్వేఛ్చ మన సమాజం ఇవ్వాలి. పెళ్ళైన ఏడాదికే ఎక్కడ కనబడితే అక్కడ ఏమైనా విశేషమా? ఇంకా విశేషం లేదా? వంటి ప్రశ్నలను మానుకోవాలి. పిల్లలను ఎప్పుడు కనాలి? ఎంతమందిని కనాలి? లేదా అసలు కానాల వద్దా అనేది ఆయా దంపతులకే వదిలేసిన నాడు మన సమాజం మెచ్యూర్ అయినట్టు.