social media trolls on nadu nedu programవైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన ‘నాడు నేడు’ గురించి వైసీపీ చాలా గొప్పగా చెప్పుకొంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అప్పులు, బాదుడు, సంక్షేమ పధకాల ప్రస్తావన తప్ప అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుక.

కనుక నాడు నేడు గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొంటూ ‘వైఎస్ జగన్ ట్రెండ్స్’ ట్విట్టర్‌లో ఓ పిల్లాడి ఫోటో వేసింది. దానిలో ఆ పిల్లాడు నాడు విద్యకు దూరమై, చిరిగిన దుస్తులతో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నిలబడిన ఫోటోను వేశారు. దానిపక్కనే మరో ఫోటోలో అదే పిల్లాడు నేడు ప్రభుత్వం ఇచ్చిన స్కూలు బ్యాగును భుజానికి తగిలించుకొని, చక్కగా యూనిఫాం, బూట్లు వేసుకొని చేతిలో నోట్ బుక్‌ పట్టుకొని స్కూలుకి వెళుతున్నట్లు చూపారు.

ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటే ప్రజలు కూడా చాలా సంతోషించి ఉండేవారు. ఎప్పుడూ తమ నెత్తిపై చెయ్యి పెట్టే జగనన్నను ప్రజలు కూడా ఆశీర్వదించేవారు. అయితే అది ‘నాడు నేడు’ కోసమే ప్రత్యేకంగా తీసిన ఫోటో షూట్ అని రుజువు చేస్తూ “నాలుగేళ్ళుగా ఒక్క ఇంచి కూడా ఎదగని పిల్లాడు” అని చిన్న సెటైర్ కూడా వేసింది.

మొదటి ఫోటోలో కిందన ‘రెడ్‌ మి నోట్ 9 ప్రొ మోడల్’ మొబైల్ ఫోన్‌తో తీసినట్లు స్పష్టంగా ఉంది. ఆ మోడల్ 2020లో విడుదలైంది. కనుక అప్పుడే ఆ మొదటి ఫోటోను తీసినట్లు అనుకొన్నా, దాని పక్కన పెట్టిన మరో ఫోటో కూడా అదే మొబైల్ ఫోన్‌తో తీసినట్లు కిందన స్పష్టంగా ఉంది. రెండు ఫోటోలను ఒకే మొబైల్ ఫోన్‌తో తీయడాన్ని ఎవరూ వేలెత్తి చూపలేరు.

కానీ ఆ రెండో ఫోటోను ఈ నెల 10వ తేదీన ట్విట్టర్‌లో పోస్ట్ చేసినట్లు పైన తేదీ తెలుపుతోంది. సాధారణంగా చిన్న పిల్లలు చాలా త్వరగా పొడవు పెరుగుతుంటారు. కానీ ఆ రెండు ఫోటోలను చూస్తే ఈ రెండేళ్ళలో ఆ బాలుడు ఒక్క ఇంచి ఎత్తు కూడా పెరిగినట్లు కనబడటం లేదు. అంటే ఈ ఫోటోలు ‘నాడు నేడు’ ప్రచారం కోసమే ఒకే సమయంలో తీసినవని అర్ధమవుతూనే ఉంది.

వైసీపీ నాడు నేడు గొప్పలు చెప్పుకోవడం కోసం కాస్త అతితెలివి ప్రదర్శించినా సాంకేతిక అంశాలను మరిచిపోవడంతో అవే దానిని ఫోటోలోనే పట్టించేశాయి.

అందుకే టిడిపి ఏపీ పరిస్థితిని ఆ బాలుడితో పోల్చి చూపుతూ “4 ఏళ్ల నుండి కోవిడ్ కారణంగా ఇంచ్ కూడా పెరగని పిల్లాడు…” అంటూ ఎద్దేవా చేసింది.