Kalvakuntla Kavithaతెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయమై ఇటు తెరాస – అటు బీజేపీ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇప్పుడు ఆ పంచాయతీ రాష్ట్ర అసెంబ్లీ దాటి దేశ పార్లమెంటుకు చేరింది. పార్లమెంట్ సమావేశాలలో తెరాస ఎంపీలు తెలంగాణలో పండించిన వరి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ పార్లమెంట్ “వెల్” లోకి వెళ్ళి తమ నిరసన తెలిపారు.

ఇదిలా ఉంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని వరి కొనుగోలు విషయంలో ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో రైతులకు తన సంఘీభావాన్ని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ట్విటర్లో సంఘీభావం తెలపడం కాదు, ఒకే దేశం – ఒకే సేకరణ విధానంతో తెరాస ఎంపీలు రోజూ పార్లమెంట్ వెల్ లోకి వెళ్ళి తమ నిరసనలు తెలుపుతున్నారు. మీకు నిజాయితీ ఉంటే పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి మీ నిరసన ద్వారా తెలంగాణ రైతులకు సంఘీభవం తెలపండి అంటూ కవిత రాహుల్ పై విరుచుకుపడింది.

సందర్భం కోసం వేచిచూసే ప్రత్యర్థి పార్టీ బీజేపీ కవిత విమర్శలను తప్పుపట్టింది. రాష్ట్రంలో మాత్రం “నో వెల్కమ్,” కేంద్రంలో మాత్రం ‘ఓకే’ అంటే ఒప్పుకోము చెల్లెమ్మా… అంటూ బీజేపీ శ్రేణులు కవితపై సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన తమ ఎమ్మెల్యేలని సభా సమావేశాల నుండి బహిష్కరించిన మీరు, పార్లమెంట్ లో మాత్రం వెల్ లోకి వెళ్లి మరీ నిరసనలు తెలపాలంటూ మీ నాయకులకే, కాకుండా ప్రత్యర్థి నేతలకు సలహాలివ్వడం “ఇదేం విడ్డురం” అంటూ కవితపై విమర్శలతో రెచ్చిపోయారు రాష్ట్ర బీజేపీ నాయకులు.