Social media jokes on ys jaganజగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండీ ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాలలో విపరీతమైన ఇసుక కొరత వచ్చి పడింది. చంద్రబాబు హయం నాటి పాలసీని మారుస్తామని ఇసుక తవ్వకాలు ఆపేశారు. అయితే సెప్టెంబర్ 5 వరకు కొత్త పాలసీ తీసుకుని రాలేదు. కొత్త పాలసీ వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈలోగా వర్షాలు కూడా ఎక్కువ కావడంతో తవ్వకాలు మరింత మందగించాయి.

కట్టడాలు ఆగిపోవడంతో లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఉపాధి లేక అలమటిస్తున్నారు. కొన్ని చోట్ల కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు పోరాటాలకు సిద్ధం కావడంతో ప్రభుత్వం ఆలస్యంగా మేలుకుంది. పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఒక ఐడియా ఇచ్చారట.

కార్మికులకు తక్షణం ఉపాధి కలిపించేందుకు ఇసుక రీచ్ లలో మెషిన్ లతో కాకుండా కార్మికులతో ఇసుక తవ్వించమని ఆదేశాలు ఇచ్చారట. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలుస్తున్నారు. “అలాగే ఇసుక రవాణాకు ట్రాక్టర్లు, లారీలు ఉపయోగించకుండా కార్మికులతో తట్టలతో మొయిస్తే మరింత మందిని ఉపాధి ఇవ్వగలం కదా” అంటూ ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్నారు.

మరోవైపు నవంబర్ 3న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా జనసేన పార్టీ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చెయ్యనున్న విషయం తెలిసిందే. దీనికి మద్దతు ఇవ్వమని పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడుకు, కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసినట్టు సమాచారం. చంద్రబాబు సంఘీభావం ప్రకటించగా, బీజేపీ సొంతంగానే ఈ సమస్య మీద పోరాడాలని నిర్ణయించుకుందట.