Social_Mediaయువతకు పని లేకపోతే దేశానికి చాలా ప్రమాదమని దశాబ్దాల వెనకే ఆర్థిక వేత్తలు హెచ్చరించారు. ఒకప్పుడు చదువు పూర్తి కాకనో లేదా ఉద్యోగం త్వరగా దొరక్కపోతేనో టైం పాస్ కాని కుర్రాళ్లకు పెద్ద ఆప్షన్లు ఉండేవి కావు. మహా అయితే థియేటర్ కు వెళ్లి సినిమాలులు చూడటం లేదా గ్రౌండ్ కు వెళ్లి గేమ్స్ ఆడి శరీరానికి మెదడుకు శ్రమ పెట్టడం. ఇప్పుడవి తగ్గిపోయాయి. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, దానికో 4జి కనెక్షన్ ఉంటే చాలు మొబైల్ డేటా లేదా వైఫై వాడుకుని విచ్చలవిడిగా సమయాన్ని వృధా చేయడానికి బోలెడు ఆప్షన్లు. పక్కనున్న వాడితో మాట్లాడ్డానికి తీరిక లేనంత బిజీగా మెడలు వంచేసి ఫోన్లే ప్రపంచంగా బ్రతికే టీనేజ్ దేశం మొత్తం కోట్లలో ఉంది.

ముఖ్యంగా పట్టుమని పాతికేళ్ళు దాటని యువకులు డ్రగ్స్ కంటే దారుణంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. ఒక పరిమితి వరకు బాగుంటుంది కానీ హీరోల మీద హద్దులు దాటిన అభిమానం పిచ్చిగా ముదిరి ఇప్పుడు ఏకంగా ఆన్ లైన్ నుంచి వీధుల దాకా వచ్చేసింది. ఎవరు ఎలా ఎక్కడ మొదలుపెట్టారనేది పక్కనపెడితే గత ఇరవై నాలుగు గంటలకు పైగా మహేష్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల వార్ కాస్తా శృతి మించి ఏకంగా బెంగళూరు హైదరాబాద్ రోడ్ల మీద రమ్మని సవాళ్లు విసురుకునే దాకా చాలా దూరం వెళ్లిపోయింది. ఈ పరిణామాల మీద ఆసక్తి పెంచుకున్న నెటిజెన్లకు విరక్తి పుట్టేలా వాళ్ళ టైంలైన్ మొత్తం ఈ గొడవ తాలూకు మురికే కనిపిస్తోంది

ఒక చిన్న కవ్వింపు ఇంత రచ్చకు కారణమయ్యింది. ఒకడు అపోజిషన్ హీరోని గేలి చేస్తూ ట్వీట్ చేశాడు. అవతల వేరొకడు దానికి స్పందించి రారా చూసుకుందాం అంటూ ఫలానా మాల్ అడ్రెస్ ఇచ్చాడు. తీరా అక్కడ జరిగింది వేరు. ముందు ట్వీట్ చేసిన వాడు వెళ్ళాడు. ఎవరూ కనపడకపోయేసరికి అక్కడ ఫుట్ పాత్ మీద చీర గాజులు పెట్టి ఇవి మీకోసమేనని రెచ్చగొట్టాడు. దీంతో అవతలోడు గూగుల్ మ్యాప్ షేర్ చేసి మరీ వస్తున్నా అంటూ ఇంకో సవాల్ విసురుతాడు. బెంగళూరు బన్నేరుఘట్ట నుంచి హైదరాబాద్ మూసపేట్ దాకా ఈ కంపు పాకిపోయి మందుకొట్టి రోడ్డు మీద నిలబడి రెచ్చగొట్టేల వీడియోలు షేర్ చేసి మరీ దీన్ని పెద్దది చేశారు

హీరోలు మేమంతా ఒక్కటేనని పదే పదే చెబుతున్నా అభిమానం ముసుగులో పైత్యం తలకెక్కిన ఫ్యాన్స్ కి అది అర్థం కావడం లేదు. ఆర్ఆర్ఆర్ టైంలో చేసుకున్న రచ్చ అంత ఈజీగా మర్చిపోయేది కాదు. ప్రభాస్ మహేషే కాదు మధ్యలో పవన్ బ్యాచ్ కూడా దూరిపోయింది. నిజానికి వీళ్లంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న శాడిటిస్టిక్ మనస్తత్వాలు. సినిమాలు బాగుంటే మళ్ళీ మళ్ళీ చూడటమో సెలెబ్రేట్ చేసుకోవడమో లేదా ఛాన్స్ దొరికితే వాళ్ళను కలుసుకోవడమో అభిమానం అనిపించుకుంటుంది కానీ ఇలా వీధులకెక్కే దరిద్రాన్ని ఏదో గొప్ప ఘనత మిగిలినవాళ్లు పబ్లిసిటీ ఇవ్వడం కన్నా వెకిలితనం వేరొకటి వెతికినా దొరకదు