Pawan Kalyan - Somuveerrraju - BJP-కొత్తగా నియమితులైన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన పదవీకాలాన్ని ఉత్సాహంగా మొదలు పెట్టారు. పార్టీ దశదిశలు మారుస్తానని ప్రకటించి అందుకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. అయితే ఆయన ఒక వార్తా పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాశం అయ్యింది.

“గత ఎన్నికలలో జనసేనకు వచ్చిన 18 శాతం ఓట్లు… మాకు వచ్చిన 7% ఓట్లు మాకు బాగా ఉపయోగపడతాయి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయి. ప్రజలు మా వైపే చేస్తున్నారు,” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు తమ వైపు చూస్తున్నారు, వలసల గురించి పక్కన పెడితే జనసేన, బీజేపీలకు వచ్చాయి అని చెప్పిన ఓట్ల గురించే ఇప్పుడు చర్చ.

నిజానికి ఆ ఎన్నికలలో జనసేనకు అటుఇటుగా 7% ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. ఆ విషయం చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డారో లేక చెబితే బాగోదు అనుకున్నారో గానీ అంకెల గారడీ చేసేశారు వీర్రాజు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే… వీర్రాజు 1998లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఏ ఏ సీటు ఎంత మెజారిటీ వచ్చిందని గుక్కతిప్పుకోకుండా చెబుతారు.

ఇటీవలే జరిగిన ఎన్నికల లెక్కలు తెలియవు లేదా మర్చిపోయారు అంటే మాత్రం అనుమానమే. “వీర్రాజు మర్చిపోయారా? మోసం చేస్తున్నారా?,” అంటూ సోషల్ మీడియాలో పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… తమకు 2019లో వచ్చాయని చెప్పుకుంటున్న ఆ ఓట్లు.. 2024 ఎన్నికలలో గనుక ఆ పార్టీలు సాధిస్తే మాత్రం ఆ కూటమి రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యంగా బలపడినట్టే అంటున్నారు నిపుణులు.