తెలంగాణ సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్నారు కనుక ఏదోరోజున ఏపీలో కూడా ఎంట్రీ ఇవ్వడం తధ్యం. సంక్రాంతికి విజయవాడ లేదా గుంటూరులో బహిరంగసభ నిర్వహిస్తారని, ఏపీలో అసంతృప్త రాజకీయనాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మొట్టమొదట కర్ణాటక, మహారాష్ట్రాలలో తాము అడుగుపెడతామని కేసీఆర్ స్వయంగా చెప్పారు. కనుక ఏపీలో ఇప్పటికిప్పుడు ప్రవేశించే ఉద్దేశ్యం లేదని స్పష్టం అయ్యింది.
ఒకవేళ ఏపీలో అడుగుపెడితే రాష్ట్ర విభజన, ఆంద్రులను అవమానించడం మొదలు నీళ్ళు, ఆస్తుల పంపకాలు, బకాయిల ఎగవేత, పోలవరంపై బిఆర్ఎస్ వైఖరి వంటి చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది. ఇది ఆయనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అదీగాక ఏపీలో వైసీపీ, టిడిపిలు చాలా బలంగా ఉన్నాయి. జనసేన, బిజెపిలకు ఎంతో కొంత పట్టుంది. వాటన్నిటి కులసమీకరణాల లెక్కలు వేరే ఉన్నాయి. కనుక కేసీఆర్ తొందరపడి ఏపీలో ప్రవేశిస్తే ఎదురుదెబ్బ తగిలితే అది ఆయన జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఆయన తనకు అనుకూలంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలలో అడుగుపెట్టాలని నిర్ణయించుకొన్నట్లు భావించవచ్చు.
Also Read – జగన్ ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారో గానీ…
అయితే ఏపీలో ఎదురయ్యే ఈ ప్రశ్నలన్నిటికీ కేసీఆర్ సమాధానాలు సిద్దం చేసుకొని, ఏపీలో ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటి రాజకీయ నిరుద్యోగులను, అసంతృప్తులను కూడగట్టుకొన్నాక తప్పకుండా ఏపీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయం. అది మూడు నెలల్లోనా… ఆరు నెలల్లోనా… లేక వచ్చే ఎన్నికలలోనా అనేది అప్రస్తుతం. కానీ కేసీఆర్ లేటుగా వచ్చినా లేటెస్టుగానే వస్తారు. కనుక సమరమా శరణమా అనేది ఏపీలో అన్ని పార్టీలు తేల్చుకోకతప్పదు.
బిఆర్ఎస్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించిన రాజకీయ వ్యవహారమే కాకుండా జాతీయస్థాయి వ్యవహారం కూడా దానితో ఎటువంటి వైఖరి అవలంభించాలి?అనే అంశంపై వైసీపీ, టిడిపి, జనసేన మూడు పార్టీలు అంతర్గతంగా చర్చించుకొంటున్నాయి. ఏపీలోకి బిఆర్ఎస్ ఎంట్రీని వైసీపీ మంత్రులు తేలికగా కొట్టిపడేస్తుండగా టిడిపి, జనసేనలు ఇంతవరకు స్పందించలేదు. కానీ త్వరలో స్పందించక తప్పదు.