So Many Personal Challenges to Mahesh Babu in 2022సినిమాల్లో విలన్లతో పరిస్థితులతో ధీరోదాత్తంగా పోరాటలు చేసే హీరోలను చూసి విజిల్స్ వేస్తాం కానీ నిజానికి వాళ్ళు మనలాంటి సగటు మనుషులేనని గుర్తించేది ఆ స్టార్ల వ్యక్తిగత జీవితాల్లో విషాదాలను చూసినప్పుడు. అందులోనూ అజాతశత్రువుగా పేరు తెచ్చుకుని ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయే మహేష్ బాబు లాంటి వాళ్లకు జరిగినప్పుడు అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా తల్లడిల్లిపోతారు. ఫ్యాన్స్ ప్రేమగా సూపర్ స్టారని పిలుచుకునే మహేష్ పరిస్థితి చూస్తే నిజంగానే ఇలాంటి విషాదాలు పగవాడికి కూడా రాకూడదనేలా ఉన్నాయి. చూసేందుకే ఇలా అనిపిస్తే ఇక అనుభవించే వాళ్ళ వేదనను ఎలా వర్ణించగలం

కరోనా సమిసిపోయి కొత్త వెలుగులు తీసుకొస్తుందని భావించిన 2022 మహేష్ బాబుకి మాత్రం తీరని చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. జనవరిలో తాను ప్రాణంగా ఇష్టపడే అన్నయ్య రమేష్ బాబు దూరమయ్యారు. దురదృష్టవశాత్తు కరోనా వల్ల కనీసం చివరి చూపు భాగ్యం కూడా దక్కలేదు. ఒకే రక్తం పంచుకుని ఒకే చోట పెరిగి కలిసి సినిమాల్లో నటించి తనను ఇంత స్థాయికి తీసుకొచ్చిన సోదరుడిని కడసారి చూసుకోలేకపోవడం ఎంత క్షోబో పంటిబిగువున భరించేవాళ్ళకే తెలుస్తుంది. తల్లిని అమితంగా ప్రేమించే మహేష్ ఆవిడను కూడా ఇటీవలే కోల్పోవడం పరిశ్రమలో ప్రతిఒక్కరిని కదిలించింది. ఇందిరాదేవిగారి మీదున్న గౌరవాభిమానాలు ఏ స్థాయిలో ఉండేవో చాలా ఇంటర్వ్యూలలో చూడొచ్చు

ఇవన్నీ తట్టుకుని నిలబడినా తనను నటుడిగా మలచి ఇప్పుడు అనుభవిస్తున్న సూపర్ స్టార్ స్టేటస్ కి పునాది వేసిన కృష్ణ గారిని ఆసుపత్రి పడక మీద నిస్సహాయ స్థితిలో చూడటం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఆయన సంపూర్ణంగా కోలుకోవాలనే ప్రతి ఒక్కరి ఆశా ఆకాంక్ష. డాక్టర్లు నలభై ఎనిమిది గంటల వరకు ఏమీ చెప్పలేమని అనడం ఆందోళన ఇంకా పెంచుతోంది. ఒకపక్క ఈ ఏడాది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజమౌళి ప్రాజెక్టు ఓకే అయిన ఆనందం కన్నా ప్రాణంగా భావించే కుటుంబ సభ్యులకు ఇలా జరగడం వల్ల కలిగే బాధే ఎక్కువ. ఇది తలుచుకుని అభిమానులు సైతం మహేష్ పట్ల తల్లడిల్లిపోతున్నారు.

జీవితంలో ఇలాంటి ఆటుపోట్లు సహజమే అయినా మరీ ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం మాత్రం అరుదు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు, గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేయడం లాంటి ఎంతో మంచి చేస్తున్న మహేష్ కు త్వరలోనే మునుపటి రోజులు తిరిగిరావాలని అందరి కోరిక. త్రివిక్రమ్ తో మొదలుపెట్టిన సినిమా కూడా సవ్యంగా జరగడం లేదు. పలు కారణాలతో జాప్యం జరుగుతూనే ఉంది. ఇంకొక్క నలభై అయిదు రోజులు అయిపోతే కొత్త సంవత్సరం వస్తుంది. ఎప్పుడు ఏ వేడుకలో చూసినా హాయిగా నవ్వే మహేష్ మళ్ళీ మళ్ళీ అలాగే కనిపించాలని ఆశించడం తప్ప అభిమానులైనా మరొకరైనా కోరుకునేది ఏముంది.