సాధారణ వ్యక్తులను సెలబ్రిటీలుగా ఎలా మీడియా చేయగలదో, ఒక పామును దేవతగా చేయగల సామర్ధ్యత మీడియాకు సాధ్యమైందని దుర్గాడలో ఉన్న పాము నిరూపించింది. తూర్పు గోదావరి జిల్లా, దుర్గాడలోని ఓ వ్యక్తి పొలంలో కనిపించిన పామును సుబ్రహమణ్య స్వరూపంగా ప్రముఖ మీడియా సంస్థ గత వారం రోజులుగా వరుస కధనాలను ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే.

మీడియా ప్రచారంతో ప్రజలు కూడా అంతే స్థాయిలో పామును చూడడానికి ఇతర జిల్లాల నుండి కూడా తరలివచ్చారు. ప్రజల వద్దకు వచ్చిన ఆ పాము కాటేయకుండా అక్కడక్కడ తిరుగుతుండడంతో, దైవత్వంతో కూడిన పామేనన్న నమ్మకం ప్రజల్లో మరింత పెరిగింది. అయితే గడిచిన 25 రోజులుగా ఆహరం తీసుకొని ఆ పాము గురువారం సాయంత్రం నాడు మరణించడంతో సదరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఏది ఏమైనా ఆ పాము దైవస్వరూపమేనని భావిస్తున్న గ్రామస్తులు రాబోయే శ్రావణ మాసంలో ఖచ్చితంగా గుడి కట్టి తీరుతామని అంటున్నారు. రెండు రోజుల క్రిందట కుబుసం విడిచిన ఆ పాము, గడిచిన నెల రోజులుగా ఆహారం సేవించక మరణించి ఉంటుందని, వైద్యులు చెప్తున్నారు. అందులోనూ ఎండ వాతావరణాల్లో పాములు అస్సలు బ్రతకలేవని స్నేక్ నిపుణులు గత వారం రోజులుగా అదే మీడియాలో ఊదరగొడుతున్నారు.Snake-in-Durgada