Anni Manchi Sakunamule Samajavaragamanaపెళ్లి చేసి చూడు పాత సామెత. సినిమాకు ఓపెనింగ్స్ తెప్పించి చూడు కొత్త నానుడి. కంటెంట్ ఎంత బాగున్నా ఓపెనింగ్స్ రావాలంటే నిర్మాతలకు చుక్కలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్టార్ క్యాస్టింగ్ లేనివాటికి ఇదో పెద్ద సవాలే. వచ్చే వారం అన్నీ మంచి శకునములే రిలీజ్ కాబోతోంది. ప్రాజెక్ట్ కె బ్యానర్ కావడంతో పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియాతో క్రమం తప్పకుండా ఇంటరాక్ట్ అవుతున్నారు. హీరో హీరోయిన్ దర్శకుడు మొన్నటి దాకా ఊళ్లు కాలేజీలు చుట్టి వచ్చి ప్రచారం చేసుకున్నారు.

అదే రోజు శ్రీవిష్ణు సామాజవరగమన వస్తోంది. ప్రస్తుతానికి పెద్దగా చప్పుడు చేయడం లేదు. వాయిదా ఉందేమో ఇప్పటికైతే ఏం చెప్పలేదు. నెలాఖరున రాబోతున్న మేమ్ ఫేమస్ బృందం ఏకంగా విజయ్ దేవరకొండను రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కు వాడుకుంది. రైటర్ పద్మభూషణ్ టైంలో ఛాయ్ బిస్కెట్ టీమ్ చూపించిన క్రియేటివిటీ దాని సక్సెస్ కి చాలా దోహదం చేసింది. ఇప్పుడు కొత్త కుర్రాళ్లతో చేసిన ఈ ఫేమస్ కు సైతం ఏదో సృజనాత్మకత చూపించాల్సిందే. అది ఫ్రీ షోలా మరొకటా అనేది రోజులు గడిచే కొద్దీ అర్థమవుతుంది.

విచిత్రంగా కొన్నింటికి పెద్ద చెమట చిందించాల్సిన అవసరం ఉండదు. నరేష్ పవిత్ర లోకేష్ ల మళ్ళీ పెళ్లికి బయ్యర్లలో క్రేజ్ నెలకొంది. రీజనబుల్ రేట్లకు కొంటే లాభాలొస్తాయనే ధీమాలో ఉన్నారట. ఏదైనా సినిమాలో వీళ్ళిద్దరూ తెరమీద కనపడితే ఈలలు వేసే ఆడియన్స్ నిజంగా ఈ జంట కోసం థియేటర్ల దాకా వస్తారా అంటే ఏమో చెప్పలేం. కొన్నిసార్లు బాక్సాఫీస్ పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. ఈ ఏడాది అతి పెద్ద విజయం సాధించిన బ్లాక్ బస్టర్స్ లో ఒక్క బలగం మాత్రమే ట్రెండ్ కు ఎదురీది కేవలం ఎమోషన్లతో గెలిచింది.

ఓటిటి కాలంలో పబ్లిక్ ఏ సినిమాకు ఎలా టర్న్ అవుతారో చెప్పలేని పరిస్థితి. బాగానే ఉందన్న ఉగ్రంకు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. పొలిటికల్ ఎజెండాతో తీశారని విమర్శలు ఎదురుకున్న ది కేరళ స్టోరీని బాగానే చూస్తున్నారు. యాభై డెబ్భై కోట్లు ఖర్చు పెట్టారన్న సానుభూతి ఏజెంట్, శాకుంతలకు పని చేయలేదు. గోపీచంద్ మీదున్న సాఫ్ట్ కార్నర్ రామబాణంకు అసలు ఉపయోగపడలేదు.ఇమేజ్ ఉన్న హీరోలకే ఈ పరిస్థితి ఉంటే మీడియం రేంజ్ చిత్రాలకు ఇబ్బందులు ఎదురు కావడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఈ తిప్పలు.