SkyLab Reddy owns Balapur Ganesh Ladduవినాయకచవితి పర్వదినం అంటే ఖైరతాబాద్ గణేశుని విగ్రహం, బాలాపూర్ లడ్డూ లేకుండా ఊహించడం సాధ్యం కాని విషయం. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుని ఎత్తు పెంచుకుంటూ వెళ్తుండగా, ఈ ఏడాది మాత్రం నగరంలో ఏర్పడిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల రీత్యా ప్రభుత్వం ఎత్తును తగ్గించాల్సిందిగా ఆదేశించడంతో మునుపటితో పోలిస్తే… గణేశుడు ఎత్తు తగ్గారు. అలాగే ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్న నేపధ్యంలో ఈ ఏడాది ఎంతమేరకు అందుకుంటాడో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఓ పక్కన వరుణ దేవుడు చిరు జల్లుల రూపంలో ఆశీర్వాదం అందజేస్తుండగా, బాలాపూర్ గణేషుడి చేతిలోని ప్రసాదం వేలం పూర్తయింది. వేలం పాటలో లడ్డూను 14.65 లక్షలకు ‘స్కై లాబ్’ సంస్థ అధినేత రెడ్డి దక్కించుకున్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఇది ఆల్ టైం రికార్డు. ఈ ఉదయం బాలాపూర్ వీధుల్లో ఊరేగింపు అనంతరం లడ్డూ వేలాన్ని నిర్వహించారు. నలుగురు స్థానికేతరులు సహా మొత్తం 25 మంది లడ్డూను వేలం పాడేందుకు పోటీ పడ్డారు.

ఈ జాబితాలో పలువురు రియల్ ఎస్టేట్ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా స్కై ల్యాబ్ రెడ్డి, మన్నెం బల్వంత రెడ్డి, కొలన్ రామిరెడ్డి, రఘునాధచారీల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. లడ్డూ ధర ఒక్కో లక్షా పెరుగుతుంటే భక్తులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గత సంవత్సరం 10.32 లక్షలకు లడ్డూను మదన మోహన్ రెడ్డి సొంతం చేసుకోగా, ఈ ఏడాది దానిపై 4.33 లక్షలు ఎక్కువ పెట్టి రెడ్డి కైవసం చేసుకున్నారు. 1,116 రూపాయలతో ఆరంభమైన బాలాపూర్ లడ్డూ వేలం ప్రతి ఏడాది అంతకంతకూ పెరుగుతూ పోతోంది.