sivaji fired on BJP for not giving special status for andhra pradeshఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ సాధనే లక్ష్యంగా కార్యాచరణ గావించే ప్రముఖ నటుడు, ప్రత్యేక సాధన సమితి అధ్యక్షుడు శివాజీ మరోసారి మీడియా ముందుకు వచ్చి… బిజెపి తీరును ఎండకట్టారు. “ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడి హక్కు… ఎంటువంటి సందేహమూ లేదు… ఇవ్వము అని మీరంటే… ఇచ్చేదాకా ఊరుకోము అని మేమంటాం..” అంటూ రాష్ట్ర ప్రజల తరపున తన గళాన్ని స్పష్టంగా తెలిపారు శివాజీ.

ఇక, బిజెపి నాయకులను నిలదీస్తూ చేసిన వ్యాఖ్యలు… బహుశా రేపో మాపో మరో ప్రెస్ మీట్ పెట్టి బిజెపి నేతలు తమ అక్కసునంతా శివాజీపై వెళ్ళగక్కవచ్చు. ఆ రేంజ్ లో శివాజీ ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులను మీడియా ముందు ఏకరువు పెట్టారు. ‘ప్రత్యేక హోదా’ ఏపీకి అవసరం లేదని మీడియాకు చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారంతా మీడియాకు కాకుండా నేరుగా ప్రజల్లో బహిరంగ సభ పెట్టి చెప్పే దమ్ముందా? అంటూ మండిపడ్డారు.

“ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన ఆ ఇద్దరు వ్యక్తులను ముందుగా ఆ చెంపా… ఈ చెంపా వాయించండి…” అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా..! “ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ కంటే ఎక్కువ ద్రోహం చేసింది బిజెపి పార్టీనేనని” అన్న శివాజీ… తాము ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులమని, అయితే ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ అయితే రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తుందో… వారితో కలిసి పోరాడుతామని స్పష్టం చేసారు.

తెలంగాణా కలను ఎలాగైతే సాకారం చేసుకున్నామో… ఏపీకి ప్రత్యేక హోదాను కూడా అలాగే సాధించుకుంటామని, అయితే బిజెపిని నమ్ముకుంటే మిగిలేది మట్టి, నీళ్ళే అన్న పదజాలాన్ని నొక్కివక్కాణించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కర్ణాటక ప్రజలకు కూడా బిజిపికి ఓటు వేయవద్దు అంటూ పిలుపునిచ్చారు. ఏపీకి ద్రోహం చేస్తున్న వైనం ప్రతి ఒక్కరికి కనపడుతూనే ఉన్నా… ప్రస్తుతం ఎవరూ నోరెత్తలేని పరిస్థితి.

తెలుగుదేశం ఏమో వచ్చే కొద్ది పాటి నిధులు కూడా రాకుండా పోతాయేమోనన్న భయంతో ఉండగా, అక్రమాస్తుల కేసుల చిట్టా ఉన్న వైసీపీ అధినేత బిజెపిని గానీ, మోడీని గానీ పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. ఇక, పవన్ గురించి ప్రస్తావించకపోవడం ఆరోగ్యానికి చాలా మంచి విషయం. ఈ తరుణంలో ‘ప్రత్యేక హోదా’ గళాన్ని కాస్త భీకరంగా వినిపిస్తున్న వ్యక్తులలో శివాజీ ప్రధముడు.

తనకు ఎలాంటి పదవులు వద్దని, “స్పెషల్ స్టేటస్” అన్నది ఆ నలుగురు కోటీశ్వరుల కోసం కాదని, సామాన్యుల కోసమని చెప్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిస్వార్ధమైన ఈ ప్రయత్నం విజయవంతమై, ఏపీకి ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నేరవేరుస్తుందని ఆశిద్దాం. ఒకవేళ రాజ్యాంగ సవరణే అవసరమైతే పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న బిజెపికి లోక్ సభలో బిల్లు ఆమోదించుకోవడం పెద్ద విషయం కూడా కాదన్న విషయాన్ని కూడా శివాజీ ప్రస్తావించారు.