Sivaji-Andhra-Pradesh-Latestఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ దాడి ప్రారంభమైందని హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం నాడు చంద్రబాబుకు నోటీసులు అందజేయబడతాయని అన్నారు. నిన్న అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని… ఆ ఫోన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని, ఇది అత్యంత విశ్వసనీయమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారమని చెప్పారు.

బీజేపీ చేపట్టిన ఆపరేషన్ గరుడ కొత్త రూపం దాల్చుకుని, ఏపీపై దాడికి తెగబడుతోందని శివాజీ తెలిపారు. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి… మహా అయితే ఓ నాలుగు రోజులు ఆలస్యం కావచ్చు లేదా వారం ఆలస్యం కావచ్చని… కానీ చంద్రబాబుపై దాడి మాత్రం తథ్యమని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం ముమ్మాటికీ భవిష్యత్ తరాలను నాశనం చేయడమేనని మండిపడ్డారు.

తనకు చంద్రబాబు అయినా, జగన్ అయినా ఒకటేనని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తనకు ముఖ్యమని, ఒక ముఖ్యమంత్రి వల్ల తమకు జాతీయ స్థాయిలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందనే భావనతో… ఆయన అడ్డుతొలగించేందుకు మరోసారి బీజేపీ పంజా విసురుతోందని అన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని శిక్షించేందుకు ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. సమయం చూసి, దెబ్బతీసేందుకు యత్నించడం చాలా దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇబ్బందులకు గురి చేసేందుకు ఇలాంటి దారుణమైన పనులు అవసరమా? అని ప్రశ్నించారు. బ్రిటీష్ వారు నేర్పిన విభజించు – పాలించు అనే సిద్ధాంతాన్నే జాతీయ ప్రభుత్వాలు ఒంటబట్టించుకున్నాయని విమర్శించారు. చంద్రబాబుపై దాడి జరగబోతోందని రాత్రి తెలిసినప్పటి నుంచి తనకు నిద్ర లేకుండా పోయిందని అన్నారు.

మీ పార్టీ ప్రయోజనాల కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారా? చంద్రబాబు నచ్చకపోతే ఆయన్ని చంపేయండని, రేపు జగన్ నచ్చకపోతే ఆయననూ చంపేయండని, ఆ తర్వాత ఎవరు నచ్చకపోతే వాళ్లందరినీ చంపేయండి అంటూ నిప్పులు చెరిగారు. ఈ దేశ రాజ్యాంగ స్ఫూర్తి ఇదేనా? రాజకీయాలు నీతిబద్ధంగా ఉండాలని, వ్యక్తిగతంగా తీసుకుని టార్గెట్ చేయడమేంటని? దుయ్యబట్టారు.

అలాగే తనకూ ప్రాణహాని ఉందని చెప్తూ… ‘ఇప్పటికే రెండు సార్లు’ అంటూ మధ్యలోనే ఆపేశారు. మీడియా లేకపోతే తాను ఎప్పుడో చనిపోయేవాడినని… విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మొన్నటి వరకు పీడీ అకౌంట్ల పేరుతో బీజేపీ గోల గోల చేసి, ప్రజలను మాయలో పడేసి… ఇప్పుడు మరో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబును లోపల వేయాలని యత్నిస్తోందని హీరో శివాజీ మండిపడ్డారు.

మొన్నటి వరకు తిరుమల పేరుతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని… ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు, ఎందరో టీటీడీ ఈవోలు పని చేశారని… టీటీడీలో అంతా సవ్యంగానే ఉందని అందరూ చెప్పారని… అయినా ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చివరకు స్వామీజీలను, ఇతర పార్టీల నేతలను సీన్ లోకి తెచ్చారని ఒక విధంగా బిజెపిపై దండయాత్ర చేసారు శివాజీ.