Dance Master Sivashankar- Daughter In Lawసంప్రదాయమైన పాటలకు కొరియోగ్రఫీ చేసి విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పటికీ, జీ తెలుగులో ప్రసారమైన ‘ఆట’ టీవీ ప్రోగ్రాంకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం ద్వారా సామాన్యుడికి చేరువ చేసిన ‘డాన్స్ మాస్టర్’ శివశంకర్ తన కుటుంబ సమస్యను వివరిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఓ లేఖ రాశారు. ‘తమ కుటుంబ సమస్యను పరిష్కరించకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని’ ఈ లేఖలో పేర్కొనడం విశేషం.

2013లో తన కుమారుడు విజయ శంకర ప్రసాద్ కు బెంగళూరుకు చెందిన జ్యోతితో వివాహం జరిపించామని… అనంతరం ఏర్పడ్డ విభేదాలతో జ్యోతి తన కుటుంబాన్ని వేధిస్తోందని లేఖలో ప్రస్తావించారు. విడాకులు తీసుకున్న తరువాత కూడా తమ కుటుంబంపై కేసులు పెట్టి మనోవేదనకు గురిచేస్తోందని, ఆమె వేధింపులు భరించలేక, కొంత కాలం అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయామని తన ఆవేదనను వ్యక్తపరిచారు.

10 కోట్లు డిమాండ్ చేస్తూ తమ ఇంటిని లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని, తన కుటుంబ సమస్య అయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించాలని జయలలితను కోరిన మాస్టర్, లేని పక్షంలో ఆత్మహత్యే తమ కుటుంబానికి శరణ్యమని అన్నారు. ఒక సెలబ్రిటీ హోదాలో టాలీవుడ్, కోలీవుడ్ లలో శివశంకర్ మాస్టర్ కున్న ప్రాముఖ్యత సినీ జనాలకు తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం సామాన్యుడికి కాస్త వింతగా ఉన్నా… కుటుంబ విభేదాలలో ఉండే ‘మజాలకు’ సెలబ్రిటీలు కూడా అతీతం కాదన్న విషయాన్ని ఈ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది.