YSRCP_Sarpanch_Patani_Deviతమ పార్టీ బీసీలకు, మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని చాటింపు వేసుకోవడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో ఇటీవల బస్సుయాత్ర చేయించింది వైసీపీ ప్రభుత్వం. అయితే, వైసీపీ ప్రభుత్వం, పార్టీలో వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లాలోని జి.మేడపాడు బీసీ మహిళా సర్పంచ్ పఠాని దేవి చెపుతున్నారు. చెప్పడమే కాదు… తన గోడును వీడియో రికార్డ్ చేసి ఆదివారం విడుదల చేశారు.

తాను బీసీ మహిళా సర్పంచ్ అనే గౌరవం ఇవ్వకుండా స్థానిక వైసీపీ నేత మోరంపూడి శ్రీరంగనాయకులు తనను మానసికంగా చాలా వేదిస్తున్నాడని ఆమె ఆరోపించారు. గ్రామంలో డ్రైనేజి నిర్మాణం కోసం తీర్మానం చేసి 15వ ఆర్ధిక సంఘానికి పంపించి, ఆ సొమ్మును పంచాయతీ సాధారణ నిధుల నుంచి తీసుకొనేందుకు చెక్కుపై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

కానీ తాను అందుకు అంగీకరించకపోవడంతో స్పందన కార్యక్రమంలో తాను లంచం డిమాండ్ చేశానని అందుకే చెక్కు ఇవ్వడం లేదని ఆయన తనపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీడీవోను కలిసి సంజాయిషీ ఇచ్చుకొనేందుకు తాను భర్తతో కలిసి కార్యాలయానికి వస్తున్నప్పుడు, వైసీపీ నేత మోరంపూడి శ్రీరంగనాయకులు ఆయన అనుచరులు కలిసి తమపై దాడి చేశారని తెలిపారు.

వైసీపీలో బీసీలకు చాలా ప్రాధాన్యం, గౌరవం ఉందని భావిస్తే కనీసం ఓ మహిళా సర్పంచ్‌ననే గౌరవం కూడా లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేత మోరంపూడి శ్రీరంగనాయకులుని పార్టీ అధిష్టానం నియంత్రించకపోతే ఏదో రోజున ఆయన వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందని పఠాణి దేవి ఆవేదన వ్యక్తం చేశారు.