situation in sabarimala is criticalమహిళలు కూడా శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకోవచ్చని ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, అప్పటినుండి పుణ్యక్షేత్రం కాస్త రణస్థలంగా మారిపోయింది. గతమాసంలో అయిదు రోజుల పాటు తెరచుకున్న అయ్యప్ప ఆలయ పరిసర ప్రాంగణమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, రేపు సోమవారం నాడు మరొకసారి ఆలయం తెరుచుకోనుండడంతో అదే పరిస్థితులు నెలకొన్నాయి.

రేపు 9 గంటల పాటు ఆలయాన్ని తెరచివుంచనుండగా, సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్వామిని దర్శించుకునేందుకు 10 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న దాదాపు 70 నుంచి 80 మంది ఇప్పటికే కొండకు బయలుదేరినట్టు తెలుస్తుండటంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఆలయంతో పాటు పంబా నది నుంచి నీలక్కల్ వరకూ వెళ్లే మార్గాలను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, భక్తులను కూడా నియంత్రిస్తున్నారు.

ఆలయంలోకి వెళ్లేందుకు 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సిద్ధమైనట్లు స్థానిక ఎమ్మెల్యే జార్జ్ గవర్నర్ కు కూడా లేఖ రాశారు. ఈ కారణంగా అల్లర్లు చెలరేగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వీరందరిని వీరిని ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో శబరిమల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. భక్తులు గుమిగూడి వుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరిస్తుండగా, మహిళలు ఎవరైనా వస్తే అడ్డుకుని తీరుతామని భక్తులు అంతే దీటుగా చెబుతున్న పరిస్థితి నెలకొంది.