Drug Case Officer Akun Sabharwal Suddenly Goes on Leaveటాలీవుడ్ మెడకు చుట్టుకున్న డ్రగ్స్ కేసు తొలి జాబితాలో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి, వారందరినీ విచారిస్తున్న సిట్ అధికారులు, రెండో జాబితాను సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఓ అగ్ర నిర్మాత కుమారులతో పాటు, మరో హీరో, హీరోయిన్లు, సాంకేతిక నిపుణుల పేర్లను సేకరించి వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్న వేళ సినీ పెద్దలు రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే కుదేలైన సినీ పరిశ్రమ రెండో జాబితా నోటీసులతో మరింత దిగజారుతుందని, పరిశ్రమ మనోస్ధైర్యం దెబ్బ తింటుందని, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ఇతర సినీ పరిశ్రమల ముందు లోకువ అయిపోతుందన్న కోణంలో ప్రభుత్వ పెద్దలతో వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఓ బడా నిర్మాతతో పాటు, గతంలో హీరోగా, ఇప్పుడు విలన్ గా వైవిధ్యమైన పాత్రలు ధరించి మెప్పిస్తున్న నటుడు పరిశ్రమ తరఫున ప్రభుత్వంతో రాయబారం నడపగా, టీఆర్ఎస్ సర్కారు మెత్తబడినట్టు సమాచారం.

ప్రస్తుతం సాగుతున్న విచారణ కొనసాగినా, మీడియా వర్గాలలో ప్రసారం అవుతోన్న అనవసర ప్రచారాన్ని ఆపే దిశగా చర్యలు తీసుకోవాలని, ఎవరో ఒకరిద్దరి తప్పుల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమను ఊబిలోకి నెట్టవద్దని వారు కోరగా, వెంటనే ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి కొన్ని ఆదేశాలు వెళ్లినట్టు మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో రెండవ జాబితా ఉంటుందా? మరింత మంది సెలబ్రిటీలకు నోటీసులు వెళ్తాయా? లేదా? అన్నది అనుమానాస్పదమే అంటున్నాయి మీడియా వర్గాలు.