SIT-investigation-questioned-Actress-bhavana!మలయాళ ముద్దుగుమ్మ భావనను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో ఇప్పటికే హీరో దిలీప్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం దాఖలు చేసుకున్న దిలీప్ కు అక్కడ చుక్కెదురైంది. దిలీప్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, దిలీప్ తరపు న్యాయవాది రామ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.

అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన ఇవే వ్యాఖ్యలను దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ గతంలోనే వ్యాఖ్యానించడం విశేషం. తన మాజీ భర్త దిలీప్ ది పెద్ద క్రిమినల్ మైండ్ అని, భావన కేసులో ఖచ్చితంగా దిలీప్ హస్తం ఉండి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ఇదే నిజమని తేలడం, దిలీప్ ను అరెస్ట్ చేయడంతో మంజు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర ప్రాధాన్యత లభించింది. దీంతో ఈ కేసులో మంజు తెరపైకి వచ్చింది.

అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా పోలీసులు మంజు వారియర్ సిట్ విచారించింది. ఇప్పటికే సాక్ష్యాధారాల సేకరణలో భాగంగా మంజు స్టేట్మెంట్ ను రికార్డు చేసిన అధికారులు, తాజాగా మరోసారి మంజుని విచారించడం విశేషం. దిలీప్ స్వభావం తెలుసుకునేందుకు విచారించారా? లేక ఈ కేసులో మంజు వ్యాఖ్యలు కూడా కీలకం కాబోతున్నాయా? అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? అన్న రీతిలో మాలీవుడ్ నాట చర్చలు జరుగుతున్నాయి.