Sir Vinaro Bhagyamu Vishnu Kathaజనాన్ని సినిమా విడుదల మొదటి రోజు థియేటర్లకు రప్పించడం మీడియం రేంజ్ నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఎంత ప్రమోషన్లు చేసినా పబ్లిసిటీ ఇచ్చినా కనీసం మొదటి ఆట హౌస్ ఫుల్ అవుతుందన్న గ్యారంటీ ఉండటం లేదు. పెద్ద హీరో అయితే అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ లేకపోతే మాత్రం అంతకంతా కొత్త కొత్త సర్కస్సులు చేయక తప్పదు. అందుకే నయా జమానా ప్రొడ్యూసర్లు ఎంచుకున్న స్ట్రాటజీ ముందు రోజు ప్రీమియర్లు. ఈ వారం సార్, వినరో భాగ్యము విష్ణుకథ రెండింటికి ఇది ఫాలో అయ్యారు.

గతంలో ఇది ఇంత తీవ్రంగా ఉండేది కాదు. అసలు రిలీజ్ డేట్ అనేది అన్ని క్యాలికులేషన్లు చెక్ చేసుకుని పక్కాగా ఉందని నిర్ధారించుకున్నాకే అనౌన్స్ చేస్తారు. అలాంటప్పుడు ముందు రోజు షోలు వేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి. ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. తెలుగు తమిళ జనాలకున్నంత సినిమా పిచ్చి దేశంలో ఎక్కడ లేదన్నది వాస్తవం. అందరికంటే ఒక రోజు ముందే కొత్త మూవీ చూడటమన్న ఆలోచనే మంచి ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. అందులో హీరో ఎవరు రేంజ్ ఏంటన్నది అప్పటికి అనవసరం.

ఈ ఎమోషనల్ వీక్ పాయింట్ నే నిర్మాతలు ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. అడవి శేష్ మేజర్ కు పది రోజుల ముందే షోలు వేస్తే అబ్బో సూపరని సోషల్ మీడియాలో వేలాది ట్వీట్లు పడ్డాయి. కట్ చేస్తే ఆ స్క్రీనింగ్స్ తాలూకు స్పందన చూసి ఓపెనింగ్ రోజు థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. ఇదే ప్లాన్ 777 ఛార్లీకి వర్కౌట్ అయ్యింది. మొన్న రైటర్ పద్మభూషణ్ టీమ్ కి ఈ ఎత్తుగడే గొప్ప ఫలితాన్ని అందించింది. అలా అని ప్రతిసారి ఇలాగే జరుగుతుందని కాదు. మంచిరోజులు వచ్చాయి, థాంక్ యుకి తేడా కొట్టింది.

ఒకప్పుడు విడుదలకు ముందు కేవలం డిస్ట్రిబ్యూటర్లు ఇండస్ట్రీ సన్నిహితులకు మాత్రమే ఈ ముందస్తు ఆటలు ఉండేవి. ఇప్పుడు కామన్ పబ్లిక్ కి అందుబాటులోకి తేవడం వల్ల పాతబడి మరుగునపడిన ట్రెండ్ కి మళ్ళీ ఊపిరి పోస్తున్నారు. ఇది మెల్లగా అందరూ అలవాటు చేసుకునే అవకాశం లేకపోలేదు. బాగున్న సినిమాలకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఎటొచ్చి కంటెంట్ ఏదైనా తేడా కొడితే ఇది బూమరాంగ్ లా రివర్స్ అయిపోయి అసలు తేదీ ఉదయం ఆటకే పబ్లిక్ ని రాకుండా చేస్తుంది. ఇప్పటికైతే వీటికి సక్సెస్ రేట్ ఎక్కువే ఉంటూ వచ్చింది. ఇదిలాగే కొనసాగితే మంచిదే.