Singer SP Balasubrahmanyamలెజెండరీ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. ఆగస్టు మొదటి వారంలో కరోనా బారిన పడి ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య కారణాలు తిరగబెట్టడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆసుపత్రి వర్గాల సమాచారం. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

శ్రీ శ్రీ శ్రీ మ‌ర్యాద రామ‌న్న సినిమాతో గాయ‌కుడిగా బాలు ప‌రియం అయ్యారు. ఈ సినిమా 1966 డిసెంబ‌రు 15న విడుద‌ల అయ్యింది. అప్పటి నుండి అనేక భాషల్లో ఆయన దాదాపుగా 40,000 పాటలకు తన గాత్రం ఇచ్చారు. ఒక‌సారి అయితే రికార్డింగ్ థియేట‌ర్‌లో 12 గంట‌ల్లోనే ఆయ‌న 17 పాట‌లు పాడారు.

ప్లేబ్యాక్ సింగ‌ర్‌గా ఆయ‌న‌కు ఆరు నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డులు వ‌చ్చాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి 25 నంది అవార్డుల‌నూ అందుకున్నారు. 2001లో కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప‌ద్మ శ్రీతో స‌త్క‌రించింది. 2011లొ ఆయ‌న‌కు ప‌ద్మ విభూష‌ణ్ కూడా ద‌క్కింది. ఆయన లేని లోటు సినీ సంగీత ప్రపంచానికి తీర్చలేనిది.