Singer-kalpana-shocked-NTRతెలుగు నాట నెంబర్ 1 షోగా వీక్షకుల ఆదరణను చూరగొన్న ‘బిగ్ బాస్’ షోలో ఆదివారం నాడు జూనియర్ ఎన్టీఆర్ కే షాక్ తగిలింది. ఈ వారంలో ఇప్పటికే మహేష్ కత్తి ఎలిమినేట్ కాగా, ‘డబుల్ ధమాకా’ ఆఫర్ లో భాగంగా హరితేజ, దీక్షాపంత్ లను సేఫ్ జోన్ లో ఉంచుతూ, మరో పార్టిసిపెంట్ కల్పన ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ ఎలిమినేషన్ జరిగిన తర్వాత షాక్ కు గురి కావడం ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ తో పాటు, ఈ షోను విజయవంతంగా నిర్వహిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వంతు కూడా అయ్యింది.

‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్నంత వరకు చాలా డల్ గా కనిపించిన సింగర్ కల్పన, ఎలిమినేట్ అయ్యి ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ వద్దకు చేరుకున్న తర్వాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. హౌస్ లో ఉన్న అందరి సభ్యులను ఇమిటేట్ చేస్తూ, తనదైన శైలిలో వారి గురించి పాటలు పాడుతూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా చూసిన బిగ్ బాస్ హౌస్ మేట్స్, మళ్ళీ వైల్డ్ కార్డ్ లో మా కల్పనను మాకు పంపించేయండి… అంటూ డిమాండ్ చేసారంటే, ఏ స్థాయిలో కల్పన వారిని ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.

కల్పనను చూసి తానే షాక్ తిన్నానని చెప్పిన తారక్, ఇంతకాలం హౌస్ లో ఎందుకు అంత డల్ గా ఉన్నారు? అని ప్రశ్నించగా… తాను ఏం చేసినా నటిస్తున్నాను… తను మంచిదాన్ని అనిపించుకోవడం కోసం ఇలా చేస్తోంది… అలా చేస్తోంది… అని ప్రతి విషయంలో తనను వేలెత్తి చూపడంతో… తాను అలా అయిపోయానని, ఒక్కసారి ఎలిమినేట్ అయిపోయాను అని చెప్పగానే, తాను రిలాక్స్ అయిపోయానని చెప్పిన కల్పన మాటలు ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. నిజానికి హౌస్ లో చూసిన కల్పనకు, ఎలిమినేట్ అయిన తర్వాత చూస్తున్న కల్పనకు ఎక్కడా పొంతన లేదు.