Singapore Finance Minister Vivian Balakrishnan responds on amaravatiఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చాకా అమరావతి పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సింగపూర్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేనట్టుగా కనిపిస్తుంది. అమరావతి ప్రాజెక్టు పై కొత్త ప్రభుత్వం వచ్చాకా సింగపూర్ మొట్టమొదటి సారి స్పందించింది. అమరావతిపై సింగపూర్‌ ఆర్థిక మంత్రి వీవీఎన్‌ బాలకృష్ణన్ స్పందించారు. కొత్త ప్రభుత్వ నిర్ణయాలు గమనిస్తూనే ఉన్నామన్నారు.

అమరావతి ప్రణాళికపై ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించుకోవచ్చని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును రివ్యూ చేయాలనుకుంటోందని సింగపూర్‌ కన్సార్షియం తమకు తెలిపిందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం కోసం తాము వేచిచూస్తున్నామని, సమీక్ష ప్రభావాన్ని కూడా అంచనా వేసుకుంటున్నామని ఆయన సింగపూర్‌లో జరిగిన ఓ సదస్సులో తెలిపారు. ప్రాజెక్టులపై సమీక్షించుకునే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు.

అయితే ఆయన ఎక్కడా కూడా సింగపూర్ కన్సార్షియం ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు చెప్పకపోవడం గమనార్హం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం ప్రాజెక్టు ను ముందుకు తీసుకుని వెళ్ళే ఉద్దేశం గానీ, సింగపూర్ కన్సార్షియంతో అమరావతి స్టార్ట్ అప్ ప్రాజెక్టు గురించి సంప్రదింపులు జరిపే ఉద్దేశం గానీ ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ క్రమంలో సింగపూర్ కన్సార్షియం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.