'అఖండ' ధియేటర్ల సీజ్... టాలీవుడ్ దిక్కెవరు..?రోజుకు కేవలం 4 షోలను మాత్రమే ప్రదర్శించాలంటూ ఇటీవల ఏపీ సర్కార్ బిల్ పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం పూర్తయిన తర్వాత విడుదలైన తొలి సినిమా ‘అఖండ’ కావడంతో, ఈ ప్రభావం ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరి ఏపీలో ‘అఖండ’ రిలీజ్ పరిస్థితి ఏంటి? అంటే…

జగన్ సర్కార్ తీసుకున్న నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో “అఖండ” బెనిఫిట్ షోలు పడ్డట్లుగా మీడియాలలో వార్తలు వచ్చాయి. మరికొన్ని చోట్ల బెనిఫిట్ షోలు కాకపోయినా, మొదటి రోజు 5 ఆటలను ప్రదర్శించే విధంగా టైమింగ్స్ ను మార్చుకున్నారు. సాయంత్రం వరకు అంతా సజావుగానే సాగింది అనుకున్నారు.

ఇంతలో కృష్ణాజిల్లాలోని మైలవరంలో ఉన్న సంఘమిత్ర ధియేటర్ ను సీజ్ చేయడంతో ధియేటర్ యజమానులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఒకవేళ బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే, నాలుగు షోలతో మాత్రమే ఆపేయాలని, 5వ షో ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేసారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్లు అమ్మాలని తెలిపారు.

ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలతో ఇంకెన్ని థియేటర్లు సీజ్ అవుతాయో అన్న ఆందోళన ధియేటర్ వర్గాలలో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితులు మున్ముందు కూడా కొనసాగితే, ఏపీలో ఫ్యాన్సీ రేట్లకు పెద్ద హీరోల సినిమాలు అమ్ముడుపోవడం అనేది కలేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ ఇక ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందే అన్న సూచనలకు కొదవలేదు.

ఈ 4షోల ప్రదర్శన మరియు టికెట్ ధరల పెంపు నిర్ణయాలు కేవలం పెద్ద సినిమాలకే పరిమితం. అది కూడా తొలి 3 లేక 4 రోజులు మాత్రమే! ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత భారీ హిట్ కొట్టినా టికెట్ ధరలతో నిమిత్తం లేకుండా ధియేటర్లు ఖాళీ అయిపోతాయి. ప్రస్తుతం ‘అఖండ’ సోలో రిలీజ్ కాబట్టి 4షోలైనా థియేటర్లను ఎక్కువగా కేటాయించారు.

కానీ సంక్రాంతికి పరిస్థితి ఇలా ఉండదు. కేవలం 8 రోజుల గ్యాప్ లో మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో… జగన్ సర్కార్ నిర్ణయం టాలీవుడ్ కు గుదిబండలా మారనుంది. సిల్వర్ స్క్రీన్ పై సహజంగా హీరోలు అద్భుతాలు సృష్టించి ఎలాంటి సమస్యనైనా ‘చిటికె’లో పరిష్కరించేస్తారు. మరి టాలీవుడ్ ను ఒడ్డున పడేసే ‘రియల్ హీరో’ ఎక్కడ నుండి వస్తారో! అసలు వస్తారంటారా?!