Siddharth nath singh on andhra pradesh special statusఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ లేదని, భవిష్యత్ లో కూడా రాదని ఏపీ బీజేపీ ఇన్ చార్జ్ సిద్ధార్థ్ నాధ్ సింగ్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. దేశంలో ఇప్పటికే 11 రాష్ట్రాలకు ‘ప్రత్యేక హోదా’ ఉందని, కొత్తగా మరో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం… భవిష్యత్ లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేటాయించడం జరగదని, అందులో భాగంగా ఏపీకి కూడా ఇవ్వడం సాధ్యమయ్యే విషయం కాదని తేల్చిచెప్పారు. అయితే, బీజేపీకి ఏపీ ప్రత్యేక రాష్ట్రమని, అందుకే ఏపీని కేటగిరీలో పెట్టడం లేదని, ఏపీకి స్పెషల్ స్టేటస్ లేకపోయినా బీజేపీకి మాత్రం ఏపీ స్పెషల్ స్టేట్ అని మాటలతో కాస్త శాంతింపచేసే వ్యాఖ్యలు చేసారు. నీతి ఆయోగ్ ద్వారా మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఇదే వ్యాఖ్యలను మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి కూడా రిపీట్ చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని, అందుకే ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామని కేంద్రం చెబుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం బీజేపీ చిత్తశుద్ధితో పని చేసిందని, ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన విషయం బిజెపి ఘనకార్యంగా చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీకి మధ్య చిన్న తేడా ఉందని, అది టెక్నికల్ పదంతో కూడిన తేడాయే తప్ప ఇంకేమీ కాదని బీజేపీ కోర్ కమిటీ సమావేశం కూడా తీర్మానించింది.

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనేవి భావోద్వేగ సమస్యలేనని, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పేర్కొనలేదని, విభజన చట్టంలో ఉన్నవన్నీ నెరవేరుస్తామని, చట్టంలో లేకపోయినప్పటికీ 6,403 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేశామని, ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోర్ కమిటీ అభిప్రాయపడింది. పార్టీ సమవేశాల్లో చర్చించిన అంశాలను అధ్యక్షుడు అమిత్ షాకు వివరిస్తామని, జూన్ మాసంలో అమిత్ షా ఏపీలో పర్యటిస్తారని, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడమే తమ లక్ష్యంగా బీజేపీ ఇన్ చార్జ్ సిద్ధార్థ్ నాధ్ సింగ్ తెలిపారు.

తాజా పరిణామాలతో ఒక విషయమైతే స్పష్టంగా కనపడుతోంది. ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డు పెట్టుకుని, అధికార పార్టీ తెలుగుదేశంపై బురద జల్లడం… తద్వారా ఏపీలో బిజెపిని బలోపేతం చేసేందుకు ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధమైందని రాజకీయ విజ్ఞులకు ఇట్టే అవగతమవుతోంది. అంతేకాదు, ఇటీవల కాలంలో జగన్ పై బిజెపి నాయకులు కాస్తంత ప్రేమను కురిపిస్తున్న విధానం బహుశా భవిష్యత్తు రాజకీయాలకు సంకేతాలా? అన్న ప్రశ్నలను ఉత్పన్నమయ్యేలా చేస్తోంది.