Shreyas Ayyar Substitute Run out - Ind VS Autralia Test serieటెస్ట్ సిరీస్ విజయానికి కీలకంగా మారిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు టీమిండియా రాణించింది. విరాట్ కోహ్లి లేకుండా రెహానే నేతృత్వంలో బరిలోకి దిగిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది. దానికి తగిన విధంగానే తొలి సెషన్ లో ఆసీస్ ఏకంగా 131 పరుగులు చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి పటిష్ట స్థితిలో ఉంది. దీంతో ఫస్ట్ డే ఆసీస్ ఆధిపత్యం ఖాయమని భావించిన వారికి రెండవ సెషన్ లో కులదీప్ యాదవ్ రూపంలో పెద్ద షాక్ తగిలింది.

ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లోనే అవాక్కయ్యే బంతులను విసిరి, ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ముప్పతిప్పలు పెట్టాడు. గత ఏడాది కాలంగా జట్టులో రాణిస్తున్న అశ్విన్ – జడేజాల బౌలింగ్ లో తృణప్రాయంగా పరుగులు చేసిన ఆసీస్ బ్యాట్స్ మెన్లు, కులదీప్ బౌలింగ్ లో మాత్రం ఆచితూచి ఆడడం విశేషం. అంతలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన కులదీప్ కు వార్నర్ రూపంలో తొలి వికెట్ లభించగా, ఆ తర్వాత అద్బుతమైన బంతులతో హ్యాండ్స్ కాంబ్, మాక్స్ వెల్ వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో రెండవ సెషన్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరో ఎండ్ లో వికెట్లు పడుతోన్నా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మాత్రం మరో సెంచరీ బాదేసాడు. ఇండియాపై గత 8 టెస్టుల్లో 7వ సెంచరీని పూర్తి చేసుకున్న స్మిత్, టీ విరామానికి ముందు అవుట్ అయ్యాడు. చివరి సెషన్ లో కీపర్ వాడే అర్ధ సెంచరీ పూర్తి చేయడంతో, ఆసీస్ స్కోర్ బోర్డు సరిగ్గా 300 పరుగుల వద్ద ముగిసింది. కులదీప్ 4 వికెట్లతో సత్తా చాటగా, ఉమేష్ యాదవ్ 2, భువనేశ్వర్, జడేజాలు చెరో వికెట్ సొంతం చేసుకున్నారు.

సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుతమైన రనౌట్ తో కెఫీని పెవిలియన్ కు పంపాడు. మొత్తమ్మీద కోహ్లి లేకుండా ఎలా రాణిస్తుందా? అన్న ప్రశ్నకు టీమిండియా గట్టిగానే జవాబిచ్చింది. అయితే తదుపరి బాధ్యత బ్యాట్స్ మెన్ల వంతు. ఆసీస్ చేసిన 300 పరుగులకు ధీటుగా బ్యాటింగ్ లో రాణిస్తే… టీమిండియాకు సిరీస్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరో వైపు టీమిండియాను త్వరగా ఆలౌట్ చేయగలిగితే ఆసీస్ కూడా అంతే అవకాశాలు ఉంటాయి మరి! దీంతో సండే నాడు బ్యాట్స్ మెన్లు ఎలా రాణిస్తారు అన్నది కీలకంగా మారింది.