Short-sirsuit-in-rajya-sabbha-parliamentపార్లమెంట్ ఎగువ సభలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం రాజ్యసభ సమావేశమైన తర్వాత మాజీ ఎంపీ ఎస్‌ జైపాల్‌రెడ్డి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. ఆ తర్వాత నాలుగో వరుసలో కూర్చున్న మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కేజే ఆల్ఫోన్స్‌ మైక్‌ నుంచి పొగలు రావడంతో వెంటనే ఆయన అక్కడి నుంచి లేచి మరో సీట్లో కూర్చున్నారు. ఆయనకు విద్యుత్‌ షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది. అయితే ఆయన క్షేమంగా ఉన్నారని ఆ తరువాత తెలిపారు.

ఆయన ఆ విషయాన్నీ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేయడంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. షాట్‌ సర్క్యూట్‌ వల్ల మైక్‌ నుంచి పొగలు వచ్చి ఉంటాయని రాజ్యసభ సభ్యులు తెలిపారు. మైక్‌ను సరిచేయాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సిబ్బందిని ఆదేశించారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇటువంటి ఘటన జరగడం మొదటి సారి. చిన్న షార్టు సర్క్యూట్ కావడంతో ప్రమాదం తప్పింది.

ఆ తరువాత సభ తిరిగి సమావేశం అయ్యాక ప్రతిపక్షం ఉన్నావ్ రేప్ బాధితురాలి కుటుంబంలో జరుగుతున్న అనుమానాస్పద హత్యలను సభ దృష్టికి తెచ్చింది. ఛైర్మన్ దీనిపై దృష్టి సారించాలని హోమ్ మంత్రిని కోరారు. అయినా ప్రతిపక్షం శాంతించకపోవడంతో మరోసారి సభను వాయిదా వేశారు. బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఆయన ఇప్పటివరకూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ కేసుపై ఇప్పటికే సిబిఐ విచారణ జరుగుతుంది.