Telangana, Telangana Eamcet-2 Leak Secret, Telangana Eamcet-2 Leak Inside Story, Telangana Eamcet-2 Leak Culprit, Telangana Eamcet-2 Leak Inside Detailsతెలంగాణా ఎంసెట్ 2 లీక్ కు సంబంధించిన గుట్టు విప్పే ప్రయత్నంలో సీఐడీ పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంసెట్ 2 మాత్రమే కాదు, ఎంసెట్ 1 కూడా లీక్ అయ్యిందన్న విషయం వెలుగు చూసింది. ఢిల్లీ కేంద్రంగా ఈ లీక్ లు జరిగినట్లుగా సీఐడీ పోలీసులు గుర్తించారు. దీంతో విద్యార్ధుల భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది.

ఇక, తెలంగాణా ఎంసెట్ 2 స్కాంకు సంబంధించిన పూర్తి గుట్టు వీడింది. ఈ స్కాం మొత్తం విలువ 50 కోట్ల రూపాయలు అని, ప్రధాన సూత్రధారి ముంబైకి చెందిన గుడ్డూ అని సీఐడీ పోలీసులు తెలిపారు. ఈ స్కాంలో మరో కీలక సూత్రధారి 2014 మెడికల్, పీజీ స్కాం నిందితుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నట్లు సీఐడీ పోలీసులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఎంసెట్-2 పరీక్ష పేపర్ ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయినట్టు నిర్ధారణ చేసారు.

అలాగే ఈ స్కాంలో గతంలో పేర్కొన్న విధంగా 30 మంది విద్యార్ధులు కాదని మొత్తం 72 మంది విద్యార్థులు నిందితులని పేర్కొన్నారు. వీరందర్నీ ముంబై, బెంగళూరు పట్టణాలకు వారి ఖర్చుతోనే తీసుకెళ్లి, పరీక్షకు 48 గంటల ముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ అందజేసినట్టు, ఇలా ఇచ్చేందుకు అడ్వాన్స్ గా 12 నుంచి 15 లక్షల రూపాయలు తీసుకున్నట్టు చెబుతున్నారు. మిగిలిన మొత్తాన్ని సీట్ వచ్చిన తరువాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు.

దీంతో ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయాలనే ఆలోచనలో తెలంగాణా సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు జరుపుతున్నారు. మాల్ ప్రాక్టీస్, లీకేజీల సంఘటనలు, ఆ సందర్భంగా తీసుకున్న చర్యలు, ఇలాంటి నేరాలపై చేసిన చట్టాలపై ఆరాతీయగా, పరీక్ష రద్దుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. సీఐడీ అధికారులు నివేదిక అందజేసిన వెంటనే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించనున్నట్టు సమాచారం.