Shock to KCR ana Kalavakuntla Kavithaతెలంగాణలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఈ ఎన్నికలలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ విజయకేతనం ఎగుర వేస్తోంది. అయితే కొన్ని చోట్ల ఫలితాలు విస్మయం కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత స్వగ్రామంలో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో కవిత విజయావకాశాలను దెబ్బతీసిన బీజేపీనే ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా షాకిచ్చింది.

కవిత స్వగ్రామమైన నవీపేట మండలం పోతంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 86 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కె.రాజు గెలుపొందారు. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రికి సైతం షాక్ తప్పలేదు. కరీంనగర్‌ జిల్లాలోని కేసీఆర్‌ దత్తత గ్రామంలో కూడా అధికార పార్టీ ఓటమి చవిచూడక తప్పలేదు. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోయారు. ఈ గ్రామంలో లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. మొత్తం 536 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన బ్యాలెట్ బాక్స్‌లను నిర్దేశించిన లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రానికి లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మూడు విడతల్లో మొత్తం 5,817 ఎంపీటీసీ స్థానాలు, 538 జడ్జీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. అందులో 4 జడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడంతో.. 534 జడ్సీటీసీలు, 5,659 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.