rana-right-eye-problemమంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం తొలి ఎపిసోడ్ లో పాల్గొన్న దగ్గుపాటి వారసుడు రానా చెప్పిన మాటలు స్పూర్తిదాయకంగా నిలిచాయి. “మరణించే ముందు తన తాత రామానాయుడు ఒక మాట చెప్పారని… కష్టాన్ని భరించగలిగే వారికే దేవుడు సమస్యలు ఇస్తాడని, అందుకే సమస్యలు ధైర్యవంతులకే వస్తాయని” కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబానికి ధైర్యం చెప్పాడు.

ఈ కార్యక్రమంలో భాగంగా కూలీగా పని చేస్తూ మృత్యు ఒడి చేరిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు సాయం చేశాడు రానా. బాధిత కుటుంబంలో మృతుడి భార్యకు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా చూపులేదు. ఆమె తల్లిదండ్రులు వయసు పైబడడంతో వారిని ‘మేము సైతం’ టీమ్ ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా రానా కూలీగా మూటలు మోశాడు. ఇలా సమకూరిన డబ్బును బాధితులకు ఇచ్చాడు.

బాధితురాలికి చూపులేదని తెలిసిన రానా తన ‘ఫ్లాష్ బ్యాక్’కు రివీల్ చేసాడు. “తనకు చిన్నప్పుడు కుడి కన్ను కనిపించేది కాదని, అయితే ఎవరో ఒక వ్యక్తి మరణించిన తరువాత దానం చేసిన కంటిని తనకు అమర్చారని, అప్పటి నుంచి తాను ప్రపంచాన్ని పూర్తిగా చూడగలుగుతున్నానని” రానా చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. అప్పుడప్పుడు ఒక కన్ను మూసి ప్రపంచాన్ని చూసేందుకు ప్రయత్నిస్తానని, ధైర్యంగా ఒకడుగు ముందుకు వేయాలని దగ్గుపాటి ఫ్యామిలీ ఎంత ఆదర్శవంతమైనదో మరోసారి నిరూపించారు.