Shivaji Raja Supports Jr NTR Comments‘రివ్యూ’ల విషయంలో అగ్ర హీరోలు స్పందిస్తున్న తీరుతో… ప్రస్తుతం ‘రివ్యూ’ అనే అంశం హాట్ హాట్ చర్చలకు దారి తీసింది. ముఖ్యంగా గంటల వ్యవధిలో ఇద్దరు అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు చేసిన రెండు విభిన్నమైన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలను ఓ కుదుపు కుదుపుతున్నాయి. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు పాళ్ళు సమంజసమని, ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శివాజీరాజా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అంత చిన్న వయసులో చాలా పరిణితి చెందిన వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారని, ఓ పక్కన తనను క్షమించమంటూ, మరో పక్కన కత్తి పెట్టి గుచ్చినట్లుగా అద్భుతంగా ప్రసంగించారని అన్నారు. సినిమా బాగుందో, లేదో అని ప్రేక్షకులు చెప్పే దాకా ఈ రివ్యూలు ఆగితే బాగుంటుందని, “అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు” వంటి చిన్న సినిమాలతో పాటు, ‘బాహుబలి, జై లవకుశ’ వంటి పెద్ద సినిమాలు కూడా ఆడాయని, ప్రేక్షకులు కరెక్ట్ గా ఉన్నారని, తారక్ చెప్పింది కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు శివాజీరాజా.

అయితే ఇదే అంశంలో మరో వ్యక్తి ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా విభేదించిన విషయం తెలిసిందే. అసలు వాళ్ళ గురించి మాట్లాడమంటే వారికి అతి ప్రాధాన్యత ఇవ్వడమేనని, జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ‘రివ్యూ’ల గురించి మాట్లాడుతుంటే, ప్రస్తుతం ‘రివ్యూ’ అనేది సినిమాల పట్ల ‘అణుబాంబు’లా మారుతోందని చెప్పవచ్చు. బహుశా వీటిపై నియంత్రణ తీసుకువచ్చే ఆలోచనలకు ఈ చర్చలు దారితీస్తాయా?