Shikhar Dhawanప్రపంచకప్‌లో కీలక సమరాల ముంగిట టీమ్‌ ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాపై సూపర్‌సెంచరీతో ఫామ్‌ చాటుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బొటన వేలి ఫ్రాక్చర్ కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీఐ ప్రకారం ఈ నెలాఖరుకు ధావన్ అందుబాటులోకి రావొచ్చు అని సమాచారం. ఈ లోగా రిషబ్ పంత్ ను ఇంగ్లాండ్ రప్పిస్తున్నారు. ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ దిగే అవకాశం ఉంది. రాహుల్ మీద నమ్మకంతో సెలెక్టర్లు మిడిల్ ఆర్డరు బలపరచడానికి పంత్ ను రప్పిస్తున్నారు.

భారత్‌ రేపు న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్థాన్‌తో, ఈ నెల 22న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. కప్పుపై ఎన్నో ఆశలతో ఉన్న భారత్‌కు ధావన్‌ గాయం కచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే. ఐసీసీ టోర్నీల్లో అతడికి గొప్ప రికార్డుంది. ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో కలిపి 20 మ్యాచ్‌లాడిన అతను 65.15 సగటుతో 1238 పరుగులు చేయడం విశేషం. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విఫలమైనా.. ఆస్ట్రేలియాపై సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అతను ఫామ్‌ అందుకోగానే గాయంతో దూరం కావడం భారత్‌కు మింగుడు పడని విషయమే. మరోవైపు ధావన్ కు రోహిత్ శర్మలకు మధ్య మంచి సమన్వయం ఉంది. ఆ కూర్పు మారడం కూడా కొంత ఇబ్బంది కలిగించేదే. ఓపెనింగ్‌లో కుడి, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉండటం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద తలనొప్పే. ధావన్ లేకపోవడంతో అది కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ ఓపెనింగ్ కు వెళ్లడం వల్ల మిడిల్ ఆర్డర్ లో ఏర్పడే ఖాళీని దినేష్ కార్తీక్ లేదా విజయ్ శంకర్లతో పొడిచే అవకాశం ఉంది.