Shikhar Dhawan scores 6th Test century,శ్రీలంకతో ప్రారంభమైన మూడో టెస్ట్ మ్యాచ్ లోనూ టీమిండియా ఆధిపత్యం కనపడుతోంది. ముఖ్యంగా ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి ఇచ్చిన ఆరంభశూరత్వం అదిరిపోయింది. ఈ సిరీస్ లో ఇప్పటికే ఓ భారీ సెంచరీని సాధించిన ధావన్, ఈ మ్యాచ్ లోనూ దూకుడైన ఆట తీరుతో మరో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 123 బంతుల్లో 17 బౌండరీలతో 119 పరుగులు సాధించిన ధావన్, టీమిండియా స్కోర్ 219 పరుగుల వద్ద ఉండగా ఔటయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ కూడా 85 పరుగులతో సత్తా చాటి మొదటి వికెట్ గా వెనుదిరిగాడు.

ఈ సిరీస్ లో అద్భుతమైన ఆట తీరుతో శిఖర్ ధావన్ క్రికెట్ అభిమానులను తన వైపుకు తిప్పుకున్నాడని చెప్పడంలో సందేహం లేదు. టెస్ట్ మ్యాచ్ లలో కూడా వన్డే తరహా బ్యాటింగ్ చేయడం ఒక్క సెహ్వాగ్ వల్లనే అయ్యింది. ఆ తర్వాత అంత దూకుడైన ఇండియన్ బ్యాట్స్ మెన్ మరొకరు లేరు. కానీ ప్రస్తుతం శిఖర్ ఫాంను చూస్తుంటే… సెహ్వాగ్ రేంజ్ కాకపోయినా… సెహ్వాగ్ తదుపరి స్థానంలో నిలిచేలా కనపడుతున్నాడు. సెహ్వాగ్ మాదిరే బౌలర్లను కుదురుకోనివ్వకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు.

అయితే మరో విశేషం ఏమిటంటే… సెహ్వాగ్ మాదిరే భారీ షాట్లకు ప్రయత్నిస్తూ వృధాగా వికెట్లు జారవిడుచుకుంటున్నాడు. బౌలర్లు వీరిని అవుట్ చేసే కంటే ముందే, వీరే బౌలర్లకు వికెట్లు సమర్పించుకోవడం సెహ్వాగ్, ధావన్ ల స్పెషాలిటీగా మారింది. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీని చేజార్చుకున్న శిఖర్, ఈ మ్యాచ్ లోనూ మరో భారీ ఇన్నింగ్స్ కు అవకాశం ఉన్నా… దానిని జారవిడుచుకున్నాడు. ఏది ఏమైనా శిఖర్ క్రీజులో ఉన్నంత వరకు టెస్ట్ మ్యాచ్ లను వీక్షించాలన్న భావనలో క్రికెట్ ప్రేమికులు ఉన్నారన్నది సత్యం.