Shikhar Dhawan India Vs Sri Lankaఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తర్వాత అద్భుతంగా రాణిస్తున్న శిఖర్ ధావన్, శ్రీలంక టూర్ ను దూకుడుగా ఆరంభించాడు. గాలేలో ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి బాటలు వేసాడు ధావన్. తొలి వికెట్ ను అభినవ్ ముకుంద్ (12) రూపంలో 27 పరుగుల వద్ద కోల్పోయిన టీమిండియా, రెండవ వికెట్ ను 280 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (190) రూపంలో కోల్పోయింది.

పుజారాతో కలిసి లంకేయుల బౌలింగ్ చీల్చిచెండాడిన ధావన్ కేవలం 168 బంతుల్లో 31 ఫోర్లతో 190 పరుగులు టీ విరామానికి ముందు ఓవర్లో ప్రదీప్ బౌలింగ్ లో మిడ్ ఆఫ్ లో ఉన్న మాథ్యూస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీ విరామం లోపున డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే తాపత్రయంతో ఫ్రంట్ ఫుట్ కు వచ్చిన కొట్టిన షాట్ బ్యాట్ కు సరిగా తగలకపోవడంతో, చివరికి డబుల్ సెంచరీ సాధించకుండానే తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు.

శిఖర్ దూకుడైన బ్యాటింగ్ తీరుతో టీ విరామ సమయానికి 55 ఓవర్లలో 282/2 పరుగులు చేసింది టీమిండియా. తొలి సెషన్ లో 27 ఓవర్లలో 115 పరుగులు చేసిన జట్టు, రెండవ సెషన్ లో 28 ఓవర్లలో 167 పరుగులు చేయడంతో పటిష్ట స్థితిలో ఉంది. ఇంకా మూడవ సెషన్ మిగిలి ఉండడంతో మొదటి రోజే 400 పరుగులు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. క్రీజులో అర్ధ సెంచరీతో ఉన్న పూజారకు కెప్టెన్ కోహ్లి జత కలిసాడు.