Shekar Kammula - Fidaa Pawan Kalyan“ఫిదా” సినిమా బ్లాక్ బస్టర్ ఉత్సాహంలో దర్శకుడు శేఖర్ కమ్ముల మునిగి తేలుతున్నాడు. నిజమే… దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత శేఖర్ కమ్ములకు లభించిన ‘రియల్’ కమర్షియల్ హిట్ “ఫిదా.” బహుశా ఊహించిన దాని కంటే ఎక్కువ విజయం సాధించిందో ఏమో గానీ, ఎప్పుడూ మాట్లాడని శేఖర్ ఇప్పుడు మీడియాల వేదికగా తెగ మాట్లాడేస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అత్యుత్సాహం ప్రదర్శించే వ్యాఖ్యలు చేసారు ఈ ‘ఆనంద్’ దర్శకుడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని ప్రదర్శించే క్రమంలో… “తాను చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానిని, ఏదైనా సీన్ రాసుకునేటపుడు ఇది పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటానని” చెప్పుకొచ్చారు. పవన్ ను అభిమానిస్తానని చెప్పడంలో తప్పులేదేమో గానీ, చిన్నప్పటి నుండి పవన్ ఫ్యాన్ అని చెప్పడం మాత్రం మరీ విడ్డూరమే భావించాలి. వయసు రీత్యా పవన్ కు, శేఖర్ కమ్ములకు మధ్య ఉన్న తేడా కేవలం అయిదు నెలలు మాత్రమే.

శేఖర్ కమ్ముల చిన్నతనంలోనే కాదు, కనీసం కుర్రాడిగా ఎదిగిన తర్వాత కూడా పవన్ సినిమాల్లోకి రాలేదు. మరి చిన్నప్పటి నుండి పవన్ ఫ్యాన్ ఎలా అయిపోతారో శేఖర్ గారికి మరియు దీనిని గుడ్డిగా నమ్మే సినీ అభిమానులకే తెలియాలి. పవన్ మొదటి సినిమా విడుదలైంది 1996లో కాగా, శేఖర్ మొదటి సినిమా 2000లో విడుదలైంది. దాదాపుగా ఇద్దరి కెరీర్స్ కూడా ఒకే సమయంలో ప్రారంభమయ్యాయి. దీంతో ఏ రకంగా చూసినా శేఖర్ కమ్ముల చిన్నతనానికి, పవన్ కళ్యాణ్ కు పొంతన లేదనేది వాస్తవం.

ప్రస్తుతం ఉత్సాహం, ఆనందంలో ఉన్న శేఖర్… ఏదో టంగ్ స్లిప్ అయ్యుండడంలో తప్పు లేదు. సాధారణంగా సినీ సెలబ్రిటీల ఇంటర్వ్యూలలో ప్రతి ఒక్కరి విషయంలో జరిగేదే. ఇందుకు శేఖర్ ఏమీ మినహాయింపు కాదన్న విషయం తెలిసిందే అంతే..! వాస్తవానికి ఇదేమీ పెద్ద మ్యాటరే కాదు. కానీ శేఖర్ కమ్ముల టంగ్ స్లిప్ అయ్యి చెప్పిన దానిని భుజాన వేసుకుని, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తున్న వారికైనా కాస్త విజ్ఞత ఉండాలి కదా! అందులో వాస్తవం ఎంత ఉందో అనేది!