Shekar Kammula About Pawan Kalyanస్వచ్చమైన క్లాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల అనే పేరు. “ఆనంద్” సినిమాతో తనకంటూ ఒక ‘బ్రాండ్’ ఏర్పాటు చేసుకున్న శేఖర్ కమ్ముల, ఇప్పటివరకు ఏ ఒక్క స్టార్ హీరోను కూడా డైరెక్ట్ చేయలేదు. అయితే చిన్న సినిమాలతో తీసినా శేఖర్ కమ్ముల బ్రాండ్ నేమ్ తో ఓపెనింగ్స్ దక్కించుకోగల సమర్ధవంతమైన దర్శకుడు. పెద్ద హీరోల కోసం ప్రాకులాడకుండా, వివాదాల జోలికి పోకుండా ఉండే శేఖర్, ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ పేరెత్తి, పవర్ స్టార్ అభిమానుల చేత తిట్టించుకునేటంత పనిచేసారు.

గత ఎన్నికలలో ‘జనసేన’ ఆవిర్భావం అయిన సమయంలో… సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికిన శేఖర్, టిడిపి – బిజెపిలకు సపోర్ట్ ఇస్తున్నానని పవన్ ప్రకటన చేయడంతో విమర్శలు కూడా చేసారు. అయితే తమ అభిమాన హీరోపై విమర్శలు చేయడం సహించలేని పవన్ అభిమానగణం శేఖర్ పై దుమ్మెత్తిపోసారు. నాటి ఉదంతం గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించని శేఖర్, తాజాగా ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు విషయంపై పెదవి విప్పారు.

నాడు పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికిన మాట నిజమేనని, అలాగే విమర్శ చేసింది నిజమేనని, అయితే పవన్ లాంటి సమర్ధవంతమైన వ్యక్తి ఆ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడం తనకు నచ్చలేదని, అలా మద్దతు తెలిపేందుకు ఒక పార్టీ పెట్టుకోవాలా? రాజకీయాల్లోకి రాకుండా అలా మద్దతు తెలిపి ఉండవచ్చు కదా!? అన్న ఉద్దేశంలోనే ఆనాడు తానూ ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప, ఇప్పటికీ నేను పవన్ కళ్యాణ్ అభిమానినేనని స్పష్టం చేసారు. అయితే ఒక వ్యక్తి పరిగెడుతూ గుంతలో పడుతున్నా గానీ… “జై పవన్ కళ్యాణ్…” అనే టైపు అభిమానిని కాదని పవన్ అభిమానులను ఉద్దేశించి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

గోతులో పడబోతుంటే ఆపడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే నాడు అలా చెప్పానని అన్న శేఖర్, 2019 ఎన్నికల నాటికి పవన్ ఎలా ఉంటాడు అన్న ప్రశ్నపై స్పందించడానికి మాత్రం వెనుకడుగు వేసారు. ఇప్పుడే చెప్పడం ఎందుకు? వేచిచూద్దాం… ఏం జరుగుతుందో..? అంటూ పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని, కాస్త సేఫ్ మాటలు మాట్లాడారు. అయితే ఒక వ్యక్తిగా పవన్ కు ఆ సత్తా ఉందని, ఇతర పార్టీలకు సహకారం ఇచ్చే కన్నా, తన స్వశక్తితో ముందుకు వస్తే బాగుటుందన్న అభిప్రాయం తనదని చెప్పుకొచ్చారు. “లీడర్” అనే వాడు ఎప్పుడూ పక్క పార్టీలకు సహకారం ఇవ్వడని, అలా చేస్తే నాయకుడిగా ఎదగలేడని తన స్పష్టమైన అభిప్రాయాన్ని పరోక్షంగా కుండబద్దలు కొట్టారు శేఖర్ కమ్ముల.