టాలీవుడ్ లో ఏమవుతుంది? ఏదో చేతబడి చేసినట్టు హీరోలకు ఈ వరుస గాయాలేంటి? ఇప్పుడు ఫిలిం నగర్ లో ఎక్కడ చూసినా ఇదే టాక్. అరడజన్ పైగా హీరోలు ఈ మధ్య కాలంలో గాయపడటం గమనార్హం. ఇదంతా రామ్ చరణ్ తో మొదలయ్యింది. జైపూర్ లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. ఆ వెనువెంటనే అదే సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ కూడా గాయపడ్డాడు. ఆ తరువాత జెంటిల్ మ్యాన్ షూటింగ్ సమయంలో నాని కూడా గాయపడి రెస్టు తీసుకుంటున్నాడు.
నిన్న మొన్న రెండు రోజులలో సుందీప్ కిషన్, నాగశౌర్య కూడా గాయపడ్డారు. ఇప్పుడు తాజాగా శర్వానంద్ కూడా ఈ లిస్టులో జాయిన్ అయ్యాడు. శర్వానంద్‌కు తన తదుపరి చిత్రం ‘96’ షూటింగ్లో గాయాలయ్యాయి. షూటింగ్లో భాగంగా శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచి ట్రైనర్స్ ఆధ్వర్యంలో హీరో రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువగా రావడంతో ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
కాళ్లపై ల్యాండ్ కావాల్సిన వ్యక్తి భుజాలను మోపి ల్యాండ్ అయ్యారు. ఆ కారణంగా షోల్డర్ డిస్ లొకేట్ అయ్యింది. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఘటన తర్వాత శర్వానంద్ వెంటనే థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. శర్వాను పరీక్షించిన డాక్టర్లు భుజానికి బలమైన గాయం తగలిందని, కాబట్టి శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. సోమవారం ఈ శస్త్ర చికిత్స జరగనుంది.