Shariff Mohammed Ahmedజగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కలలకు తాత్కాలికంగానైనా బ్రేక్ పడింది. మండలిలోని తమ ఆధిక్యతతో టీడీపీ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీనితో మూడు నాలుగు నెలల జాప్యం తప్పకపోవచ్చు. అయితే అసలు ఈ సెలెక్ట్ కమిటి అంటే ఏమిటి? దానిని విధివిధానాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.

ఓ బిల్లు వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతుందని భావిస్తే సభ్యులు సెలక్ట్ కమిటీకి పంపాలని కోరతారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపాదించింది కాబట్టి, మండలి నుంచే సెలక్ట్ కమిటీని కూడా ఎంపిక చేయాలి. శాసనసభలో స్పీకర్ కమిటీలను వేస్తారు. శాసనమండలిలో చైర్మన్ కమిటీలను నియమిస్తారు.

కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఒక మంత్రి ఈ కమిటికి ఛైర్మన్ గా ఉంటారు. శాసనమండలిలో ఏయే పార్టీకి ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలుసుకుని, వారి పర్సంటేజీ ప్రకారం ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా సభ్యులను ఎంపిక చేస్తారు. అంటే ప్రస్తుతం శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది సెలక్ట్ కమిటీలో ఉంటారు.

కమిటీకి కనీసం మూడు నెలల వ్యవధి ఇస్తారు. ఆ కమిటీ తమకు మరింత గడువు కావాలని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొంత ఆలస్యమైన ప్రభుత్వం ఈ కమిటీ రిపోర్టుతో నిమిత్తం లేకుండా మూడు రాజధానులు విషయంలో ముందుకు వెళ్ళవచ్చు. అయితే ఈ మూడు నెలల గ్యాప్ లో రైతులకు న్యాయపోరాటం చేసుకునే అవకాశం దొరుకుతుంది.