ఆస్ట్రేలియా క్రికెట్ నిత్యం ఏదొక స్కాండల్ తో వార్తలు రావడం సహజమైపోయింది. ఫ్లాష్ బ్యాక్ లో షేన్ వార్న్ సెక్స్ స్కాండల్ నుండి తాజాగా టిమ్ పైన్ సెక్స్టింగ్ వరకు ఎప్పుడూ ఆసీస్ క్రికెటర్లు లైం లైట్ లో ఉంటున్నారు.
దాదాపుగా నాలుగేళ్ల క్రితం తన సహా ఉద్యోగితో ‘సెక్స్టింగ్’ (అసభ్యకరమైన ఫోటోలు, మెస్సేజ్ లు) జరిపినందుకు గానూ క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన దర్యాప్తు వెలుగులోకి రావడంతో తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు టిమ్ పైన్.
తాను క్రికెట్ ఆస్ట్రేలియా నియమ నిబంధనలను ఉల్లంఘించలేదని, అయితే ఇది పబ్లిక్ కావడంతో ఒక గౌరవ ప్రదమైన హోదాలో తాను ఉండలేనని, అందుకే కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అయితే జట్టుకు సేవలు అందిస్తానని, త్వరలో జరగనున్న యాషెస్ సిరీస్ కు సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు.
ఇండియాతో జరిగిన సిరీస్ లో అశ్విన్ తో ఘాటైన సంభాషణలు జరిపి అప్పట్లో టిమ్ పైన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆసీస్ ఆ సిరీస్ కోల్పోవడంతో టిమ్ పైన్ పై మరిన్ని విమర్శలు వ్యక్తం కాగా, ఫ్లాష్ బ్యాక్ లో చేసిన ‘సెక్స్టింగ్’ ఏకంగా కెప్టెన్సీకే దూరం చేసింది. తదుపరి ఆసీస్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.