Shakalaka-Shankar‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో షకలక శంకర్ ఒకరు. శ్రీకాకుళం యాసతో కడుపుబ్బా కామెడీ చేసే శంకర్, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను అనుకరించడంలో పీ.హెచ్.డీ చేసాడు. దీంతో అనతికాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న శంకర్, ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా రాణించాడు. కానీ తనకు సరైన అవకాశాలు లభించడం లేదని భావించిన శంకర్, ఏకంగా హీరో అయిపోవాలని నిర్ణయించుకుని “శంభో శంకర” సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో టాలీవుడ్ లోని అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, అగ్ర నిర్మాత దిల్ రాజు, అగ్ర హీరో రవితేజల గురించి సంచలన ప్రకటనలు చేసారు. ముందుగా ఈ కధ పట్టుకుని త్రివిక్రమ్ దగ్గరికి వెళ్లి “2 కోట్లతో సినిమా నిర్మించండి, మీకు 8 కోట్లు వస్తాయంటూ చెప్పానని,” ఒక రెండేళ్ళు ఆగితే తీస్తానని త్రివిక్రమ్ చెప్పారని, ఆ తర్వాత దిల్ రాజు గారిని ఓ హాస్పిటల్ లో కలిసి “3 కోట్లు పెట్టండి 13 కోట్లు వస్తాయి, పక్కా” అంటూ చెప్పానని, ఆయన కూడా తనకున్న కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత చూద్దామని అన్నారని చెప్పుకొచ్చారు.

తనకున్న స్నేహంతో అల్లు అరవింద్ గారబ్బాయ్ అల్లు శిరీష్ ను సంప్రదించగా, ఇంకా గీతా ఆర్ట్స్ బ్యానర్ నా చేతికి రాలేదు, వచ్చిన తర్వాత నీతోనే ఏడాదికి 10 సినిమాలు తీస్తానంటూ చెప్పారని అన్నారు. అలాగే రవితేజ వద్దకు వెళ్లి తన విషయాన్ని రెండున్నర్ర గంటల పాటు వివరించానని, ఇప్పుడు హీరోగా చేయడం నీకు అవసరమా అంటూ రవితేజ అన్నారని, ఫైనల్ చేస్తాను గానీ, ప్రస్తుతం చేస్తోన్న సినిమా అయిపోయిన తర్వాత చేద్దాం అన్నారని, ఎవరూ కూడా చేయను అనలేదని, అందరూ చేద్దామనే అన్నారని, కాకపోతే అది రేపో, ఎల్లుండో అయ్యుంటే బాగుండేదని అన్నాడు.

అయితే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఎక్కడో నెల్లూరులో ఉన్న రమణారెడ్డి మా బాధ అర్ధం చేసుకుని ఈ సినిమాను నిర్మించారని, ఈ కధలో అంతటి దమ్ముందని చెప్పుకొచ్చారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత పై నలుగురు చెప్పిందే సరైనదేమోనని అనిపించక మానదు. నిజానికి ఇలా వ్యాఖ్యానించడం అనేది… హీరో మాట దేవుడేరుగు… కమెడియన్ క్యారెక్టర్లు కూడా వస్తాయో, రావోనని చెప్పకతప్పదు. తాను కమెడియన్ గా చేయడం వలనే ‘గీతాంజలి’ వంటి సినిమాలు హిట్ అయ్యాయనే ఊహల్లో ఉన్న షకలక శంకర్ కు జ్ఞానోదయం కావాలంటే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే!