Shakalaka Shankar about  pawan kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కీర్తించేవారు ఎంతమంది ఉన్నా, అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం కమెడియన్ కం ప్రొడ్యూసర్ అయిన బండ్ల గణేష్ మాత్రమే. స్టేజ్ లపై బండ్ల చేసే వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో మాంచి ఉత్సాహాన్ని నింపుతూ ఉత్తేజాన్ని కలిగిస్తుంటాయి. అందుకే పవన్ ఈవెంట్ కు బండ్ల హాజరు తప్పనిసరి అని ఫ్యాన్స్ కు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇది ‘కాస్త అతి’ అంటూ సోషల్ మీడియాలో ఎన్ని రకంగా ట్రోల్స్ జరిగినా, బండ్ల తీరు మాత్రం మారలేదు.

తాజాగా అంతటి బండ్ల గణేష్ ను మైమరిపించే విధంగా షకలక శంకర్ తెరపైకి వచ్చాడు. తాను హీరోగా చేసిన మొదటి సినిమా “శంభో శంకర” సినిమాకు పవన్ ఫ్యాన్స్ మద్దతు లభిస్తే చాలు అనుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో లేక నిజంగా తనలో అంత అభిమానం దాగి ఉందో గానీ, శంకర్ చేస్తోన్న వ్యాఖ్యలు నెటిజన్లకు ఆహారం అవుతున్నాయి. బండ్ల గణేష్ కు అప్ డేటెడ్ వర్షన్ గా కీర్తిస్తూ… ఇది మరీ శృతిమించిన భజనగా కితాబిస్తున్నారు. తాజాగా ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

“తాను చచ్చిపోయేటంత వరకు ఆయన పేరే పిలుస్తా, నేను మాత్రమే కాదు, అందరూ అలాగే చేయాలి, ఎక్కడికెళ్ళినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే అనాలి, ఆయన పేరు చెప్తే పనులైపోవాలి, ఆయన పేరు చెప్తే అన్నం దొరకాలి, ఆయన పేరు చెప్తే మంచినీళ్ళు ఇవ్వాలి” అంటూ షకలక శంకర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరీ ఊహల్లో బతకడం మాని, ముఖ్యంగా ఇలాంటి భజన కార్యక్రమాలు ఆపి, సొంత టాలెంట్ ను నమ్ముకుంటే కెరీర్ ఉంటుందంటూ వస్తోన్న విలువైన సలహాలకు కూడా లోటు లేదు.