Shailaja Reddy Alludu postponeనాగచైతన్య హీరోగా మారుతీ దర్శకత్వం వహించిన “శైలజరెడ్డి అల్లుడు” ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న కేరళవాసి గోపి సుందర్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులలో రీ రికార్డింగ్ అందించలేకపోతున్నారని, ఈ నెల 31వ తేదీకి ఈ సినిమా ధియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

దీంతో ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కావాల్సిన సంపత్ నంది “పేపర్ బాయ్” సినిమాను ఆగష్టు 31వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘శైలజరెడ్డి అల్లుడు – పేపర్ బాయ్’ల స్థానాలు ఒకటికొకటి మార్చుకొబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

“పేపర్ బాయ్”కు సంబంధించి సెన్సార్ ఫార్మాలిటిస్ తప్ప, ఇతర పెండింగ్ కార్యక్రమాలు ఏమీ లేకపోవడం ఈ వార్తలకు బలాన్నిచ్చే అంశాలు. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉందన్న టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా సంతోష్ శోభన్, రియా సుమన్ లు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.