Seven dead in stampede at Chandrababu Naidu Nellore Rallyటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. బుదవారం సాయంత్రం జిల్లాలోని కందుకూరు పట్టణంలో ఎన్టీఆర్‌ సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తుండగా త్రొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. చంద్రబాబు నాయుడు పర్యటనకి నిన్న కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా జనం తరలివచ్చారు. ఆ కారణంగా సింగరాయకొండ నుంచి కందుకూరు చేరుకోవడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.

అప్పటికే అక్కడ వీధులన్నీ జనంతో, వారి వాహనాలతో, టీవీ ఛానల్స్ వారి వాహనాలతో నిండిపోయాయి. ఇక చంద్రబాబు నాయుడు వాహనం వెంట కూడా వేలాదిమంది తరలిరావడంతో ఆ ప్రాంతం అంతా ఇసుకవేస్తే రాలనంత జనం నిండిపోయారు. ఆ ప్రాంతంలో ఊహించిన దాని కంటే చాలా ఎక్కువమంది జనం ఉండటం గమనించిన చంద్రబాబు నాయుడు తన వాహనాన్ని ముందుకు కదలనీయకుండా నిలిపివేసి, ఎక్కడ ఉన్నవారు అక్కడే నిలబడాలని త్రోసుకోవద్దని వారిస్తూనే ఉన్నారు. వారిలో కొంతమంది యువకులు రోడ్డు పక్కన ఇళ్ళ గోడలపై, ఫ్లెక్సీ బ్యానర్స్ కోసం కట్టిన కర్రల స్టాండ్లపై, చివరికి న్యూస్ ఛానల్స్ వాహనాలపై కూడా ఎక్కి నిలబడటం చూసి చంద్రబాబు నాయుడు వారిని కిందకి దిగిపోవాలని సూచించారు.

అయితే చంద్రబాబు నాయుడు వాహనం వెంట వచ్చిన జనంతో కాస్త ఇరుకుగా ఉండే గుండంకట్ట వీధిలో చంద్రబాబు నాయుడు కోసం ఎదురుచూస్తున్న జనాలపై ఒత్తిడి పెరిగింది. ఆ త్రోపులాటలో గుండంకట్ట వీధిలో రోడ్డుపక్కనే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై నిలబడి ఉన్నవారు కిందపడిపోయారు. వారిపై ఆ వాహనాలు కూడా పడ్డారు. వీధిలో అప్పటికే జనంతో కిక్కిరిసిపోయి ఉండటంతో కొందరు పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. ఆ త్రొక్కిసలాటలో కిందపడిపోయినవారు జనం కాళ్ళ కింద నలిగి ఊపిరాడక చనిపోయారు.

చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు సూచన మేరకు టిడిపి కార్యకర్తలు వెంటనే కింద పడిపోయిన 13 మందిని హాస్పిటల్‌కి తరలించారు. కానీ వారిలో ఆరుగురు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించారు. మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు తన రోడ్ షో నిలిపివేసి హాస్పిటల్‌కి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించి మృతుల బంధువులను ఓదార్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్ర రాజకీయాలలో మంచి మార్పు తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో ఇంతమంది చనిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలలో పిల్లల విద్యాభ్యాసానికి బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకొంటుంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున టిడిపి తరపున నష్టపరిహారం ఇస్తాము,” అని ప్రకటించారు.