Settlers stun experts in GHMCజీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరికొద్ది గంటల్లోనే ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ ఫలితాలపై సర్వేలను ప్రసారం చేసాయి. అయితే ఇప్పుడు ఫలితాలు అధికారికంగా వెలువడిన తర్వాత ఆ సర్వేలను గుర్తు చేసుకుంటే, కనీసం ఒక్క న్యూస్ ఛానల్ కూడా ప్రజానాడిని పట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఆ మాటకొస్తే ఒక్క సర్వేలే కాదు, నిఘా వర్గాలు అందించిన వివరాలు కూడా ఫలితాలతో మ్యాచ్ కాలేకపోవడం విశేషం.

అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 85 స్థానాలు వస్తాయని చెప్పగా, 99 సొంతమయ్యాయి. ఇక, టిడిపి + బిజెపి కూటమి విషయంలో అయితే సర్వే వివరాలు దారుణమైన అనుభవాన్ని మిగిల్చాయి. అన్ని సర్వేలు దాదాపు 20 – 30 స్థానాలు వస్తాయని చెప్పగా, రెండింటికి కలిపి కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక, కాంగ్రెస్, ఎంఐఎం విషయంలోనే సర్వే అంచనాలు ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి.

ఎంఐఎం పార్టీకి అత్యధికంగా 45 సీట్లు సొంతమవుతాయని చెప్పగా, 44 తన ఖాతాలో వేసుకుంది ఎంఐఎం. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని దాదాపుగా అన్ని సర్వేలు ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచగా, 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇంటెలిజెన్స్ విభాగాలతో సహా అన్ని మీడియా సంస్థలు హైదరాబాద్ నగర వాసులను సరిగా అంచనా వేయలేకపోయయని, ముఖ్యంగా సెటిలర్ల ఓటింగ్ వలనే ఈ సర్వేలన్నీ తారుమారయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అధికార పార్టీ సీట్లు పెరగడానికి, టిడిపి పట్టు సడలడానికి కారణం సెటిలర్ల ఓటింగ్ ప్రభావమేనని అంటున్నారు. ఫలితాలు చూసిన తర్వాత కాదనలేని పరిస్థితి.

GHMC polls