NTR_100Rupees_Silver_Coinఅటు సినిమాలలో, ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్రవేసిన నటసార్వభౌముడు, సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించనుంది. జూన్ 10వ తేదీన ఆయన శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోందని ఆయన కుమార్తె, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రిజర్వ్ బ్యాంకులోని కరెన్సీ, నాణేలని ముద్రించే మింట్ విభాగం అధికారులు ఇటీవల ఆమెని కలిసి నమూనా నాణెం చూపించారు. ఎన్టీఆర్‌కి భారత్‌ రత్న అవార్డు ఇవ్వాలని ఆమె చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ రత్న ఇవ్వలేదు కానీ ఎన్టీఆర్‌ గౌరవార్దం ఆయన బొమ్మతో వంద రూపాయల నాణెం ముద్రించేందుకు అంగీకరించింది.

నిజానికి గత ఏడాది జూన్ 10వ తేదీనే ఈ నాణెం విడుదల కావలసి ఉంది. కానీ సాంకేతిక కారణాల వలన రిజర్వ్ బ్యాంక్ విడుదల చేయలేకపోయింది. కానీ ఈసారి తప్పకుండాఎన్టీఆర్‌ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేయబోతోంది. ఇది తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా ఎన్టీఆర్‌ అభిమానులకి చాలా సంతోషం కలిగించే వార్తే! ఏదో ఓ రోజున ఎన్టీఆర్‌కి భారత్‌ రత్న అవార్డు కూడా వస్తుందని ఆశిద్దాం.