Seediri-Appalaraju-Tirumala-Tirupati-Darshan-With-150-Membersదైవదర్శనానికి ఎవరైనా కుటుంబ సభ్యులతో కలిసి వెళుతుంటారు కానీ ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సుమారు 150 మంది అనుచరులను వెంటపెట్టుకొని నేడు తిరుమల శ్రీవారిని విఐపి ప్రోటోకాల్ దర్శనం చేసుకొని తన అధికార హోదా, దర్పం ప్రదర్శించి చూపారు.

ప్రోటోకాల్ ప్రకారం మంత్రిగారికి, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ మంత్రిగారి ఆదేశాలను ధిక్కరించలేని టీటీడీ అధికారులు ఆయనతో పాటు 20 మంది అనుచరులకు విఐపి ప్రోటోకాల్ దర్శనం కల్పించి మరో 130 మందికి బ్రేక్ దర్శనం కల్పించారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన సాధారణ భక్తులను నిలిపివేసి మంత్రి సీదిరి అప్పలరాజు, అనుచరులనులోనికి పంపించి ప్రత్యేక దర్శనాలు చేయించారు.

స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తరువాత మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి తిరుమల ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఫోటోలు దిగారు. దీనిపై భక్తులు అభ్యంతరం చెప్పడంతో, ఆయన మాట్లాడుతూ, “మేమందరం సాధారణ భక్తుల మాదిరిగానే క్యూలైన్లో నిలుచోని స్వామివారిని దర్శించుకొన్నాము తప్ప మా అధికార దర్పాన్ని, పలుకుబడిని ప్రదర్శించలేదు. స్వామివారిని తనివితీరా దర్శించుకోవాలని అనుకొన్నాము తప్ప మా వలన సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించాలనుకోలేదు,” అని అన్నారు.

కానీ మంత్రి హోదా, పలుకుబడిని ప్రదర్శించి ప్రోటోకా దర్శనం చేసుకొని, వారితో ఆలయ ప్రాంగణంలోనే గ్రూప్ ఫోటోలు కూడా దిగి ‘మాకు ఆ ఉద్దేశ్యంలేదు. మేము ఆవిదంగా చేయలేదని’ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

మంత్రిగారికి ప్రోటోకాల్ సౌకర్యం ఉంది గనుక ఉపగించుకోవచ్చు. కానీ దైవ దర్శనం చేసుకొనేటప్పుడు కూడా తన పదవీ, అధికార దర్పం కాసేపు పక్కన పెట్టి భక్తిభావం పొందలేని వారు దైవదర్శనం చేసుకొని పుణ్యం సంపాదించుకోగలమని అనుకోవడం ఓ భ్రమ మాత్రమే అని గ్రహిస్తే బాగుంటుంది.