Jayalalitha secrets behind jayalalithaa deathగతేడాది డిసెంబర్ 5వ తేదీన తుది శ్వాస విడిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంలో ఏదో “రహస్యం” దాగి ఉందనేది ప్రతి ఒక్కరి అనుమానం. అయితే దీనిపై ప్రతిపక్షాలు, ప్రజల నుండి న్యాయవిచారణకు డిమాండ్ రావడంతో, ప్రభుత్వం మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి ఆధ్వర్యంలో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 27 మంది ఈ కమీషన్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వగా, తాజాగా డాక్టర్లు ఇచ్చిన సమాచారం అందరినీ అవాక్కు చేస్తోంది.

జయలలితకు వైద్యం చేయాలంటూ నాడు ప్రభుత్వం నియమించిన వైద్య బృందం, అసలు జయలలితను చూడనే లేదని, 75 రోజుల పాటు ఓ ప్రత్యేక గదికె పరిమితమయ్యామని, ఉదయం గదిలోకి వెళ్లి సాయంత్రం వరకు కాలక్షేపం చేసేవాళ్ళమని చెప్పడం కలకలం సృష్టిస్తోంది. దీంతో అసలు జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలకు ఈ సమాచారం మరింత బలాన్నిచ్చినట్లయ్యింది. సెప్టెంబరు 22న స్వల్ప అనారోగ్య కారణాలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరగా, 75 రోజుల తర్వాత తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

అంటే ప్రభుత్వం నియమించిన వైద్యులు కాకుండా వేరే బృందం జయకు చికిత్స అందించారా? అసలు ఎవరైనా చికిత్స చేసారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నిజాలన్నీ వెలుగులోకి రావాలంటే కమీషన్ ఇచ్చే పూర్తి నివేదిక బయటకు రావాల్సిందే. ఇదిలా ఉంటే 12న ఆక్యుపంక్చర్ వైద్యుడు శంకర్, 13న జయ మేనకోడలు దీప, 14న ఆమె సోదరుడు దీపక్, 20న ప్రభుత్వ మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, 21న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావులు హాజరుకానున్నారు.