Scoop On Netflix:పన్నెండేళ్ల క్రితం ముంబైకి చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్టు జిగ్నా ఓరా ఓ పుస్తకం రాశారు. దాని పేరు బిహైండ్ ది బార్స్ అఫ్ బైకుల్లా – మై డేస్ ఇన్ ప్రిజన్. మీడియా ప్రపంచంలో ఆవిడ గురించి తెలియని వారు లేరు కానీ ఆ బుక్కు చదివాకే బయటి ప్రపంచానికి విస్తుపోయే ఒక చీకటి మాఫియా కోణం కనిపించింది. అదే ఇప్పుడు స్కూప్ అనే వెబ్ సిరీస్ గా వచ్చింది.

స్కామ్ 1992తో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి మెప్పించిన హన్సల్ మెహతా ఆరు ఎపిసోడ్ల స్కూప్ ని రూపొందించారు. సెన్సేషనల్ న్యూస్ కోసం మీడియా ప్రతినిధులు కొందరు సోర్స్ మీద ఆధారపడతారు. వాళ్ళు ఇచ్చే స్కూప్స్ మీద ఫస్ట్ పేజీ న్యూస్ రాసుకుంటారు. క్రైమ్ కి సంబందించినవి ఎక్కువగా హైలైట్ అవుతాయి.

అందుకే ఏరికోరి ఈ విభాగాన్ని తీసుకుంటుంది జాగృతి పాఠక్(కరిష్మా టన్నా). చీఫ్ ఎడిటర్ మద్దతుగా ఉంటాడు. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీంకు సన్నితుడిగా ఉండి తర్వాత శత్రువుగా మారిన ఛోటా రాజన్ ని ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తుంది జాగృతి. ప్రత్యర్థి మీడియాలో పని చేసే సేన్ హత్యకు గురి కావడంతో పోలీసులు మాఫియా సంబంధాలు ఉన్నాయనే నెపంతో ఆమెను మోకా చట్టం కింద అరెస్ట్ చేస్తారు.

ఎనిమిది నెలలు జైలులో మగ్గిన తర్వాత నిరపరాధిగా బయట పడేందుకు జరిగిన క్రమమే ఈ స్కూప్. హన్సల్ మెహతా ప్రింట్ మీడియాలో డొల్లతనాన్ని, పోటీతత్వం వల్ల పడిపోయే విలువలు ఓ మహిళ జీవితాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తాయో బాగా చూపించారు. దావూద్ మాఫియా, ముంబై పోలీస్ మధ్య జాగృతి కీలుబొమ్మగా మారి తన ప్రమేయం లేకుండానే ఆనందాన్ని ఎలా నాశనం చేసుకుందో ఊహించని విధంగా సాగుతుంది.

జైలుకు వెళ్ళాక ఎదురయ్యే ఘోర అవమానాలు, అక్కడి సాటి ఖైదీలు, స్టాఫ్ చూపించే నరకం మాములుగా ఉండదు. స్వంత సంస్థే జాగృతి తప్పు చేసిందని కథనాలు రాసేదాకా పరిస్థితి దిగజారుతుందికార్పొరేట్ మాయ ప్రపంచంలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళు ఎలా చూసుకుంటారో స్కూప్ లో చూపించారు. మొత్తం ఆరు గంటల నిడివి ఉన్న స్కూప్ మధ్యలో ల్యాగ్ ఉంది. సాగతీత జరిగింది.

అయినా ప్రయత్నంలోని నిజాయితీ ఆకట్టుకుంటుంది. సోర్స్ నుంచి స్కూప్స్ తీసుకునే తతంగాన్ని డిటైల్డ్ గా చూపించారు కానీ దానికి బదులు మాఫియా-మీడియా-పోలీస్ ఈ ట్రయాంగిల్ గేమ్ లో నాటకీయ సంఘటనల గురించి ఎక్కువ ప్రస్తావించి ఉంటే బాగుండేది. కరిష్మా టన్నా పెర్ఫార్మన్స్ ఏ అవార్డుకు తీసిపోలేదు.